జైపూర్ : ఆరావళి పర్వతావళి రక్షణ సమస్యపై కేంద్ర ప్రభుత్వ వైఖరి, సుప్రీం కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా జైపూర్ ప్రజలు గురువారం సెంట్రల్ పార్కులో సమావేశమై మౌన నిరసన తెలియజేశారు. ఈ నిరసనకు భారత్ సేవా సంస్థాన్ కార్యదర్శి, రాష్ట్ర మాజీ అడ్వకేట్ జనరల్ జిఎస్ బాప్నా నాయకత్వం వహించారు. తమ ఆందోళనలను తెలియజేసే ప్లకార్డులను వీరు ప్రదర్శించారు.
కొత్త నిర్వచనం కారణంగా 90 శాతానికి పైగా చిన్న కొండలు, గుట్టలు రక్షణ పరిధిని కోల్పోయే ప్రమాదం ఉందని, ఫలితంగా మైనింగ్ మాఫియా, రియల్ ఎస్టేట్ సంస్థలకు అప్పగించే అవకాశం ఉందని వీరు ఆందోళన వెలిబుచ్చారు. ఆరావళి పర్వత సముదాయంలో 20 శాతం ఇప్పటికే మైనింగ్‌తో అంతరించిపోయిందని,ఇంకా మైనింగ్ కార్యకలాపాలు కొనసాగిస్తే ఆరావళి మొత్తం కనుమరుగౌతుందని, అదే జరిగితే భవిష్యత్ తరాలు తమను క్షమించబోవని బాప్నా ఆందోళన వెలిబుచ్చారు.