న్యూఢిల్లీ : మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి రాజకీయ చాతుర్య ప్రసంగం, మాటకు మాటగా సాగే ఘాటైన హాస్యం స్మరణీయం. వాజ్‌పేయి 101వ జయంతి సందర్భంగా ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ 1999 ఫిబ్రవరిలో లాహోర్ బస్సు యాత్ర దశలో జరిగిన ఘటనను సభికులతో పంచుకున్నారు. అణు బాంబు, పరస్పర ఘర్షణలు ఉద్రిక్తతల సడలింపు దిశలో లాహోర్ డిక్లరేషన్ సంతకాల తరువాత వాజ్‌పేయి మాట్లాడారు. ఆయన ప్రసంగం తరువాత పాకిస్థాన్‌కు చెందిన ఓ అందమైన పెళ్లికాని యువతి వచ్చి బాగా మాట్లాడారు అని అభినందించింది.
నన్ను పెళ్లాడుతావా? ఇందుకు బదులుగా కానుకగా కశ్మీర్ ఇస్తావా అని అడిగింది. దీనికి తడుముకోకుండా వాజ్‌పేయి ఆ యువతితో అచ్ఛా బచ్చీ , పెళ్లాడుతా కానీ , ఇందుకు వరకట్నంగా నాకు మీ పాకిస్థాన్ రాసిస్తావా అని కొంటెగా ప్రశ్నించారని రాజ్‌నాథ్ గుర్తు చేసినప్పుడు హర్షవ్వానాలు వెల్లువెత్తాయి. వాజ్‌పేయి వాగ్థాటి చమత్కారం అద్వితీయం అని కొనియాడారు. ఆయన ఘాటుగా మాట్లాడితే అది కవిత్వం అయ్యేది. హాస్యం రంగరిస్తే అక్కడ సంగీతం కురిసేది అన్నారు.