న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ఢిల్లీ కాథేడ్రల్ రిడెంప్షన్ చర్చిలో ఉదయం వేళ క్రిస్మస్ ప్రార్థనా సేవా కార్యక్రమానికి హాజరయ్యారు.ఇక్కడికి భారీగా తరలివచ్చిన క్రిస్టియన్ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ చర్చిలో కనులపండువగా ఢిల్లీ బిషప్ రెవరెండఖ డాక్టర పాల్ స్వరూప్ ఆధ్వర్యంలో ప్రార్థనలు, గీతాలాపనలు, ఆచారం ప్రకారం ఏసుక్రీస్తు సంస్మరణ జరిగింది. ప్రధాని మోడీ కోసం ప్రత్యేక ఆధ్యాత్మిక సందేశం కూడా వెలువరించారు. ఈ కార్యక్రమం తనకు అమితానందం కల్గించిందని ప్రధాని మోడీ ఆ తరువాత సామాజిక మాధ్యమంలో తెలిపారు.
క్రిస్మస్ శాంతి భావనా స్ఫూర్తితో సమాజంలో సహృదయత, సామరస్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ప్రేమ శాంతి, సహనం అనే కాలాతీత సందేశం ఎలుగెత్తి చాటారని కొనియాడారు. అంతకు ముందు ప్రధాని మోడీ దేశ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు, ఢిల్లీలోని క్రిస్టియన్ వర్గాల ప్రతి కార్యక్రమానికి ప్రధాని మోడీ ప్రతి ఏటా హాజరవుతున్నారు. క్రిస్మస్ పర్వదిన నేపథ్యంలో ఉప రాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కూడా సందేశంలో సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. సంతోషకర క్రిస్మస్ పరస్పర విశ్వాసం, ఆదరణ, ఆత్మీయతలకు ప్రాతిపదిక కావాలని ఆకాంక్షించారు.