పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన వృత్తిలో ఉండి దారుణమైన ఘటనకు తెగబడ్డారు ఇద్దరు ప్రభుత్వ టీచర్లు. తనది ప్రభుత్వ ఉద్యోగం, ప్రియుడిది ప్రభుత్వ ఉద్యోగం.. భర్తను చంపేస్తే ఇద్దరు హాయిగా ఉండవచ్చని అనుకుంది ఆ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. జనాలను నమ్మించేందుకు చేయాల్సిన నాటకం అంతా చేసింది. కానీ అసలు విషయం బయటకు వచ్చి ప్రియుడితో కలిసి ఇప్పుడు జైలులో ఊచలు లెక్కబెడుతోంది. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని మారుతి నగర్ కాలనీలో భార్యాభర్తలు లక్ష్మణ్ నాయక్ (38), పద్మ (30) నివాసం ఉంటున్నారు. 2024లో డీఎస్సీలో ఎంపికై ఉప్పునుంతల మండలం బట్టుకాడిపల్లి తండా ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది పద్మ. ఈ క్రమంలో పద్మకు తాడూరు ప్రాథమికోన్నత పాఠశాలలో పని చేస్తున్న రాత్లావత్ గోపి అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది.
తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను చంపాలని ప్రియుడితో మాట్లాడింది. ఈ మేరకు పథకం వేసింది. నవంబర్ 24వ తేదీన రాత్రి పడుకుని ఉన్న లక్ష్మణ్ నాయక్ ముక్కు, నోటిఫై గుడ్డతో మూసి ఊపిరాడకుండా చేసి పద్మ, గోపి చంపేశారు. అదే రోజు రాత్రి గోపి వెళ్లిపోయాడు. మర్నాడు ఉదయం ఏం తెలియనట్లు పాఠశాలకు వెళ్ళి, ఇంటి యజమానికి ఫోన్ చేసింది పద్మ. తన భర్తకు ఎంత ఫోన్ చేసినా ఎత్తడం లేదని, తనకు భయంగా ఉందని దొంగ ఏడుపు ఏడుస్తూ.. ఆందోళనగా నటించింది. తాను ఇంటికి రాగానే ఇంట్లో భర్త చనిపోయి ఉన్నాడని నమ్మించేందుకు ప్రయత్నించింది. అయితే మృతుడు లక్ష్మణ్ నాయక్ తమ్ముడికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమదైన శైలిలో విచారణ జరిపిన పోలీసులు అక్రమ సంబంధం వల్లే హత్య జరిగిందని గుర్తించారు. వాస్తవాలను రాబట్టి పద్మ, గోపిలను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు.