దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా హరీష్‌రావు వ్యవహార శైలి ఉందని, నీతులు ఎదుటి వారికి చెప్పాలని, మాకు కాదన్నట్లుగా హరీష్ రావు మాట్లాడుతున్నారని భువనగిరి ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కెసిఆర్ తిట్ల పురాణం, బూతులు ఒకసారి హరీష్ రావు చూడాలని, ఉద్యమం సమయంలో నోటికి వచ్చినట్టు కెసిఆర్ మాట్లాడారని ఎంపి చామల అన్నారు. బూతులు మాట్లాడే పేటెంట్ హక్కులు కెసిఆర్‌కు ఎలా వచ్చాయని, అసలు రాజకీయాల్లో తిట్ల పురాణం మొదలుపెట్టిందని కెసిఆర్ అని ఆయన అన్నారు. కెసిఆర్ రాజకీయంగా మాట్లాడితే రేవంత్ రెడ్డి రాజకీయాలు మాట్లాడతారని, కెసిఆర్ తిట్ల పురాణం మాట్లాడితే రేవంత్ రెడ్డి ఎక్కువ తిట్లు తిట్టగలరని ఆయన పేర్కొన్నారు. సిఎం రేవంత్‌రెడ్డిపై హరీష్‌రావు చేసిన వ్యాఖ్యలపై ఎంపి చామల గురువారం విలేకరులతో మాట్లాడారు.
రెండేళ్ల తరువాత కెసిఆర్ బయటకు వచ్చి తోలు తీస్తామంటే చూస్తూ ఊరుకోవాలా…? అని ఆయన ప్రశ్నించారు. సిఎం స్థాయి వ్యక్తిని తోలు తీస్తామంటే మర్యాదగా మాట్లాడాలా…? చెట్టుకు కట్టివేయాలా అని ఆయన అన్నారు. లాగులో తొండలు విడవాలని హరీష్ రావు మాట్లాడుతున్నారని, హరీష్ రావు వేదాలు, పాండిత్యం వల్లిస్తునారని ఎంపి చామల ఆరోపించారు. కెటిఆర్ చిన్నా, పెద్ద తేడా లేకుండా మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీష్‌రావు నీతులు కెసిఆర్, కెటిఆర్‌లకు చెప్పాలని ఎంపి చామల సూచించారు. మీరు పద్ధతిగా మాట్లాడితే రేవంత్ రెడ్డి పద్ధతిగా సమాధానం చెబుతారన్నారు. ఇక, కేంద్రమంత్రి బండి సంజయ్ భాష గురించి మాట్లాడు తున్నారని తాము చెప్పే అంశాలను ఆ దద్దమ్మలకు చెప్పాలని బండి సంజయ్‌కు ఎంపి చామల విజ్ఞప్తి చేశారు.