రాష్ట్రంలో దౌర్భాగ్యమైన పరిస్థితి నెలకొందని, సిఎ రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు చూసి తెలంగాణ ప్రజలు ఎక్కి ఎక్కి ఏడుస్తున్నారని బిఆర్‌ఎస్ నేత, మాజీ ఎంఎల్‌ఎ రసమయి బాలకిషన్ ఆందోళన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం దౌర్భాగ్యం అని మండిపడ్డారు. కెసిఆర్ హయంలో పల్లె, పల్లె పరిశుభ్రతతో కనిపించేదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత పల్లెలు దివాళా తీస్తున్నాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించారని, గెలిచిన స్థానాలన్నీ తమవే అని రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నారని చెప్పారు. కొత్తగా గెలిచిన సర్పంచ్‌ల ఆత్మీయ సమ్మేళనంలో రేవంత్ రెడ్డి రండ భాష మాట్లాడారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్‌లో గురువారం బిఆర్‌ఎస్ నేతలు చిరుమర్తి లింగయ్య, ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులతో ఆయన మీడియాతో మాట్లాడారు. బిఆర్‌ఎస్ పార్టీని లేకుండా చేస్తా అని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని, దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే కాంగ్రెస్ పార్టీ ఎన్ని రాష్ట్రాల్లో గెలిచిందో ఆయన చెప్పాలని అడిగారు. మూడు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రెపో, మాపో కర్ణాటక రాష్ట్రంలో అధికారం కోల్పోయేలా ఉందని పేర్కొన్నారు.
కెసిఆర్ లాంటి పెద్దమనిషి గురించి నీచమైన భాష మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మస్తాన్ మటన్ షాప్ దగ్గర కెసిఆర్‌కు ఉద్యోగం ఇస్తా అని అహంకారంతో మాట్లాడుతవా..అసలు నీ బ్రతుకెంత రేవంత్ రెడ్డి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌రెడ్డి కాలి గోటికి సరిపోరు అని పేర్కొన్నారు. ఉద్యమకారుడు హరీష్ రావు గురించి మాట్లాడే స్థాయి రేవంత్‌రెడ్డికి లేదని, రేవంత్‌రెడ్డి కంటే ముందు హరీష్ రావు మంత్రి అయ్యారని చెప్పారు. కెటిఆర్ తెలంగాణ హీరో అని వ్యాఖ్యానించారు. అమెరికాలో ఉండే రేవంత్ రెడ్డి తమ్ముడు బాత్రూంలు కడుగుతున్నారా..? అని ప్రశ్నించారు. అమెరికాలో ఉండే ఎన్‌ఆర్‌ఐలను రేవంత్ రెడ్డి అవమానిస్తున్నారని మండిపడ్డారు. కెటిఆర్ ఆంధ్రలో చదువుకున్నారని, అందులో తప్పేముందని అడిగారు. రేవంత్‌రెడ్డి బిడ్డను ఆంధ్రా ప్రాంతానికి చెందిన వ్యక్తికి ఎందుకు ఇచ్చావు..? అని నిలదీశారు. సర్వం ఆంధ్ర అల్లుడికి కట్టబెట్టావు కదా అని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ బిడ్డలందరికి తెలంగాణ తల్లి శోభమ్మ అని, అలాంటి తల్లిని పట్టుకొని నీ అవ్వా అని అంటవా అని రేవంత్ రెడ్డిని నిలదీశారు. రేవంత్‌రెడ్డి లాంటి కుసంస్కారం గురించి ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.
మాజీ ఎంఎల్‌ఎ చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి భాష మార్చుకోవాలని హితవు పలికారు. కెసిఆర్ ప్రెస్ మీట్ పెట్టగానే రేవంత్ రెడ్డికి లాగు తడిచి పోయిందని, అందుకే నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి దమ్ము ఉంటే వైన్స్‌లు బంద్ చేయాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ ఉన్నంత కాలం దేశంలో కాంగ్రెస్ పార్టీ ఖతం అవడం ఖాయం అని, రేవంత్ రెడ్డి ఉన్నంత కాలం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఖతం అవడం ఖాయం అని పేర్కొన్నారు. కెటిఆర్ కంటే రేవంత్ రెడ్డి అందగాడా..? అని ప్రశ్నించారు. ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ, విలువలతో కూడిన రాజకీయాలు చెయాలని, అలాంటి విలువలు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో లేవు అని వాపోయారు. రేవంత్ రెడ్డి మాటలు చూస్తుంటే ముఖ్యమంత్రి కుర్చి పరువు పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి తీరు మార్చుకోవాలని హితవు పలికారు.