టీం ఇండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీకి ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోహ్లీని కలవడం కోసం ఎంతటి సాహసాన్ని అయినా చేసే వాళ్లు ఉన్నారు. అయితే టెస్టులు, టి-20ల నుంచి రిటైర్‌మెంట్ ప్రకటించిన కోహ్లీ.. వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. అతడు ప్రస్తుతం దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొంటున్నాడు. ఇందులో భాగంగా బెంగళూరు వేదికగా ఆంధ్రతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ తరఫున కోహ్లీ ఆడాడు. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
కోహ్లీ ఈ మ్యాచ్‌లో 101 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సులతో 131 పరుగులు చేసి తన సత్తా నిరూపించుకున్నాడు. అయితే ఈ మ్యాచ్‌ని లైవ్‌లో ప్రసారం చేయలేదు. అంతేకాక.. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్ 1 గేట్లను తెరవకుండానే ఈ మ్యాచ్‌ను బిసిసిఐ నిర్వహించింది. దీంతో కోహ్లీ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. మరోవైపు భద్రతా కారణాలను చూపుతూ కర్ణాటక ప్రభుత్వం చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌లను నిర్వహించేందుకు అనుమతి ఇవ్వలేదు. ఈ క్రమంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో మ్యాచ్‌లను తరలించారు. ఈ మ్యాచ్‌ను అభిమానులు వీక్షించలేకపోయారు. దీంతో కొంతమంది మైదానం వద్ద ఉన్న చెట్లపై ఎక్కిమరి మ్యాచ్‌ను, కోహ్లీని చూసే సాహసం చేశారు. చూస్తేనే వాళ్లు చేసిన పని ఎంతో ప్రమాదకరంగా కనిపిస్తోంది. ఒకవేళ జరగకూడనిది జరిగితే అది చాలా పెద్ధ విషయం అవుతుందని వీరిని చూసిన వాళ్లు అనుకుంటున్నారు.