టీం ఇండియా స్టార్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొంటున్నాడు. ముంబై జట్టు తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు జైపూర్ వేదికగా సిక్కింతో జరిగిన మ్యాచ్‌లో రెచ్చిపోయాడు. అద్భుతమైన శతకం సాధించడంతో ముంబై ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. రోహిత్ ఈ మ్యాచ్‌లో 62 బంతుల్లోనే సెంచరీ చేశాడు. 94 బంతుల్లో 18 ఫోర్లు, 9 సిక్సులతో 155 పరుగులు సాధించాడు. దీంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును దక్కించుకున్నాడు. అయితే మ్యాచ్ సందర్భంగా రోహిత్ ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది.
రోహిత్‌ను చూసేందుకు పెద్ద సంఖ్యలో స్టేడియంకి వచ్చిన అభిమానులు ‘ముంబైకి రాజా’ అంటూ రోహిత్‌కి ఉద్ధేశించి నినాదాలు చేశారు. ఓ అభిమాని ఇంకో అడుగు ముందుకేసి రోహిత్‌ని ఆటపట్టించే ప్రయత్నం చేశాడు. రోహిత్ శర్మ ప్రస్తుతం కఠినమైన డైటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఫిట్‌నెస్ కోసం అతడు నిరంతరంగా కష్టపడుతున్నాడు. ఈ క్రమంలోనే అతను చాలా వరకూ బరువు తగ్గాడు. డైట్ ప్రకారం కొన్ని వస్తువులు తినడం నిషేధం. అయితే రోహిత్ ఫీల్డింగ్ చేస్తుండగా ఓ అభిమాని ‘రోహిత్ భాయ్ వడాపావ్ కాయేగీ క్యా’ (రోహిత్ అన్నా.. వడాపావ్ తింటావా) అంటూ కామెంట్ చేశాడు. దీనికి రోహిత్ కూడా చాలా కూల్‌గా స్సందించాడు. వద్దు అంటూ చేతితో సంజ్ఞ చేశాడు. దీంతో అభిమానులు మరింతగా సంబరాలు చేసుకున్నారు.