రంగారెడ్డి: సర్పంచ్ ఎన్నికలలో ఓటు వేయలేదని దూషించడంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గోపాలారం గ్రామంలో అనిల్(28) అనే యువకుడు తన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నాడు. ఓ ప్రైవేటు యూనివర్సిటీలో ఆఫీస్ బాయ్‌గా పని చేస్తున్నాడు. బుధవారం ఉదయం తన చలిగా ఉందని చెప్పి ఇంట్లోకి వెళ్లి పడుకున్నాడు. తలుపులు ఎంత తట్టిన రూమ్‌లో నుంచి ఉలుకు పలుకు లేకపోవడంతో డోర్లను బద్దలు కొట్టి తెరిచారు. ఫ్యాన్‌కు ఉరేసుకొని కనిపించడంతో వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందారని పరీక్షించిన వైద్యులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తమకు ఓటు వేయలేదని ఓడిపోయిన అభ్యర్థి, అనుచరులు తన కుమారుడిని దూషించడంతో ఆత్మహత్య చేసుకున్నాడని అనిల్ తల్లిదండ్రులు ఆరోపణలు చేశారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.