స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఐదు దశాబ్దాలకు పైగా, కేంద్రంలో ఏ కాంగ్రెసేతర ప్రభుత్వం కూడా పూర్తి ఐదేళ్ల పాటు అధికారంలో కొనసాగలేదు. 1999లో అటల్ బిహారీ వాజ్‌పేయి మూడవసారి ప్రధానమంత్రి అయ్యే వరకు ఇదే పరిస్థితి కొనసాగింది. వాజ్‌పేయి 24 పార్టీల సంకీర్ణ ప్రభుత్వానికి ఐదేళ్ల పాటు నాయకత్వం వహించి, సమర్ధవంతంగా నడిపించిన తీరు భారత రాజకీయ చరిత్రలోనే అపూర్వం. అప్పటివరకు రాజకీయంగా అస్థిర పరిస్థితులు ఎదుర్కొంటున్న దేశంలో సుస్థిరతకు, సుపరిపాలనకు బాటలు వేయడమే కాకుండా, వైరుధ్య భావాలు గలవారితో కలిసి ఉమ్మడిగా దేశ ప్రయోజనాలకోసం ఏ విధంగా పనిచేయవచ్చో చూపించారు. ఈ క్రమంలో, తరచుగా రాజకీయంగా ఒంటరిగా మిగిలిపోతుంది. బిజెపికి ప్రజలలో సార్వకాలిక ఆమోదయోగ్యమయ్యే విధంగా పలువర్గాలతో సంబంధాలను బలోపేతం చేశారు. వాటిలో కొన్ని నేటికీ కొనసాగుతున్నాయి.
ఈ పదవీకాలంలో, ఆయన జాతీయ రహదారుల నెట్‌వర్క్, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన, కిసాన్ క్రెడిట్ కార్డులు వంటి కార్యక్రమాలను ప్రారంభించారు. ఇవి కోట్లాదిమంది భారతీయుల జీవితాలను నేటికీ ప్రభావితం చేస్తున్నాయి. దేశంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంలో, గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను పరిపుష్టం కావించడంలో విప్లవాత్మక మార్పులకు దారితీసాయి. భారతదేశానికి మూడుసార్లు ప్రధానమంత్రిగా పనిచేసిన అటల్ బిహారీ వాజ్‌పేయి డిసెంబర్ 25, 1924న జన్మించారు. తొలుత జనసంఘ్, ఆ తర్వాత జనతా పార్టీ, చివరిగా బిజెపి పార్టీల వ్యవస్థాపక సభ్యులలో ఆయన ప్రముఖులు కావడం గమనార్హం. తన వాక్చాతుర్యానికి ప్రసిద్ధి చెందిన కవి- రాజకీయవేత్త అయిన వాజ్‌పేయి 1990ల చివరలో, 2000ల ప్రారంభంలో బిజెపికి విస్తృత రాజకీయ ఆమోదాన్ని తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. ఈ ప్రయత్నాల కారణంగానే నేడు దేశంలో అతిపెద్ద రాజకీయ పార్టీగా మాత్రమే కాకుండా అత్యధిక రాష్ట్రాలలో అధికారంలో కొనసాగగలుగుతున్నది.
1986లో ఎల్.కె. అద్వానీ పగ్గాలు చేపట్టి, రామజన్మభూమి ఉద్యమంవైపు పూర్తిగా మొగ్గు చూపుతూ మరింత కఠినమైన హిందుత్వ సిద్ధాంతాన్ని అనుసరించారు. ఇది ఎన్నికల పరంగా ప్రయోజనం చేకూర్చింది. 1991లో బిజెపి లోక్‌సభలో 120 స్థానాలను గెలుచుకుంది. అయితే, 1991లో బాబ్రీమసీదు కూల్చివేత తర్వాత, ఆ పార్టీ రాజకీయంగా ఒంటరిగా మిగిలిపోయింది. ఇక్కడే వాజ్‌పేయి రాజనీతిజ్ఞత కీలకమైంది. సరికొత్త పొత్తులను ఏర్పరచడంలో సహాయపడింది. మిత్రపక్షాలకు మరింత ఆమోదాన్ని కల్పించింది. జవహర్ లాల్ నెహ్రూ ప్రభుత్వ హయాంలో వాజ్‌పేయి ఎంపిగా ఎన్నికయ్యారు. తదుపరి ఐదు దశాబ్దాలలో, ఆయన 11 సార్లు లోక్‌సభకు, రెండుసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. తన కాలంలో, ఆయన పార్లమెంట్ ఉభయ సభల లోపల, వెలుపల వాక్చాతుర్యంతో, హుందాతనంతో ప్రసంగించారు. ఆయన రాజకీయాలతో ఏకీభవించని వారు కూడా తరచుగా ఆయనను ఒక వాగ్విశారదుడిగా ప్రశంసించేవారు. ఓ యువ ఎంపిగా ఉన్నప్పుడు ఓ విదేశీ అతిథికి ‘భవిష్యత్ ప్రధాని కాగల నేత’ అంటూ వాజపేయిని స్వయంగా నెహ్రూ పరిచయం చేశారంటే ఆయన సామర్థ్యాన్ని ముందుగానే అంచనా వేసినట్లు స్పష్టం అవుతుంది.
జనసంఘ్, బిజెపిలను ముస్లింలకు, పాకిస్థాన్‌కు వ్యతిరేకమైనవిగా ముద్రపడిన సమయంలో జనతా ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా, తదుపరి బిజెపి నుండి ప్రధాన మంత్రిగా పాకిస్తాన్‌తో భారతదేశ సంబంధాలను మెరుగుపరచడానికి ఆయన మాదిరిగా మరెవ్వరూ పట్టుదలతో ప్రయత్నాలు చేయలేదని చెప్పవచ్చు. లాహోర్ బస్సు యాత్ర ద్వారా, కార్గిల్ యుద్ధం తర్వాత ఆగ్రా శిఖరాగ్ర సమావేశం ద్వారా లేదా 2001 ఇండో -పాక్ ప్రతిష్టంభన తర్వాత ముషారఫ్‌తో బ్యాక్‌ఛానల్ చర్చల ద్వారా, వాజ్‌పేయి అన్ని అడ్డంకులను ఎదుర్కొని, రెండు యుద్ధ దేశాలను ఏకతాటిపైకి తీసుకురావడానికి తన వంతు ప్రయత్నం చేశారు. లాహోర్‌లోని మినార్- ఎ- పాకిస్తాన్‌లోని సందర్శకుల పుస్తకంలో ఆయన రాసినట్లుగా, ‘బలమైన, స్థిరమైన, సంపన్నమైన పాకిస్తాన్ భారతదేశ ప్రయోజనాలకు అనుకూలంగా ఉంది. పాకిస్తాన్‌లో ఎవరూ సందేహంలో పడకూడదు. భారతదేశం పాకిస్తాన్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తుంది.’ అంతేకాదు, పొరుగుదేశాలతో మిత్రత్వం జరపడం కన్నా మరో మార్గం లేదంటూ ‘మనం స్నేహితులను ఎంపిక చేసుకోవచ్చు, పొరుగువారికి మాత్రం కాదు’ అని విదేశాంగ విధానానికి సరికొత్త భాష్యం చెప్పారు . ఇప్పటికీ భారత్ ఈ విధానంకు కట్టుబడి ఉంది.
మే 1998లో, వాజ్‌పేయి రెండవసారి అధికారంలో ఉన్న సమయంలో, భారతదేశం పోఖ్రాన్‌లో మూడు అణ్వాయుధ పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది. ఆపరేషన్ శక్తి అనే కోడ్‌నేమ్ ఉన్న ఈ పరీక్షలు భారతదేశం అణ్వాయుధాలను మోహరించే సామర్థ్యాన్ని స్థిరపరుస్తాయి. ఈ పరీక్షలు భారతదేశ జాతీయ భద్రతా నమూనాను కూడా ప్రాథమికంగా మార్చాయి. ఆ సమయంలో అంతర్జాతీయ నిరసనలు, ఆంక్షలు ఎదురైనప్పటికీ ఎంతో హుందాగా, అసామాన్యమైన రాజనీతిజ్ఞత ప్రదర్శించి ఎదుర్కొన్నారు. ముఖ్యంగా, పరీక్ష జరిగిన ఆరు నెలలకే అమెరికా భారతదేశంపై తన ఆంక్షలను ఎత్తివేసింది. 2000లో, వాజ్‌పేయి మూడవసారి అధికారంలో ఉన్నప్పుడు, అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారతదేశాన్ని సందర్శించారు. ఇది ఇప్పుడు ఇండో- అమెరికా సంబంధాలను బలోపేతం చేయడంలో ఒక చరిత్రాత్మక సంఘటనగా పరిగణించబడుతుంది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి రష్యా వైపు మొగ్గుచూపుతూ ఉండడంతో ఓ విధంగా అమెరికాకు దూరంగా ఉంటున్న విదేశాంగ విధానంలో విశేషమైన మార్పుకు ఆయన శ్రీకారం చుట్టారు. అటు రష్యాతో బంధాన్ని పటిష్ట పరచుకుంటూ, ఇటు అమెరికాకు దగ్గర కాగలిగారు.
భారత్ – పాకిస్తాన్ మధ్య ఎప్పుడు ఘర్షణలు తలెత్తినా బహిరంగంగానే పాకిస్థాన్‌కు మద్దతుగా అప్పటివరకు ఉంటూ వస్తున్న అమెరికా మొదటిసారిగా కార్గిల్ యుద్ధం సమయంలో పాకిస్థాన్‌కు సహకరించేందుకు నిరాకరించింది. అమెరికాతో పాటు చైనా కూడా ముందు తమ సేనలను కార్గిల్ పర్వతాల నుండి వెనుకకు రప్పించి తమతో మాట్లాడమని పాకిస్థాన్‌కు నిక్కచ్చిగా చెప్పే విధంగా భారతదేశం చేయగలిగింది. చరిత్రలో మొదటిసారిగా అంతర్జాతీయంగా పాకిస్తాన్ ఒంటరిగా మిగలాల్సి వచ్చింది. విద్యార్థి దశనుండి విదేశాంగ వ్యవహారాలపై ఆసక్తిచూపుతూ వస్తున్న వాజపేయి ప్రతిపక్ష నేతగా కూడా అంతర్జాతీయంగా భారతదేశ ప్రయోజనాలు కాపాడటంలో కీలకంగా వ్యవహరిస్తూ ఉండేవారు. ప్రధాన మంత్రులుగా రాజీవ్ గాంధీ, పివి నరసింహారావు వంటి వారు పలు సందర్భాల్లో అంతర్జాతీయ సదస్సులకు వాజపేయిని అధికార ప్రతినిధిగా పంపారు.
1971 యుద్ధం సమయంలో సైతం నాటి ఇందిరా గాంధీ ప్రభుత్వంకు పూర్తి మద్దతుగా నిలబడటం ద్వారా జాతీయ ప్రయోజనాలకోసం పార్టీ ప్రయోజనాలను లెక్కచేయని నేతగా ఆయన గుర్తింపు పొందారు. విదేశాంగ మంత్రిగా ఆయన పర్యటనకు గుర్తుగా పాకిస్థాన్ లో ఓ వీధికి ఆయన పేరు పెట్టారంటే ఆయన ప్రభావం అర్థం అవుతుంది. అటు పాకిస్థాన్‌లో, జమ్మూకశ్మీర్ లలో స్థానిక ప్రజల విశ్వాసం అపారంగా చూరగొన్న ఏకైక ప్రధాని వాజపేయి అని చెప్పవచ్చు. దుర్లభమైన కశ్మీర్ సమస్య పరిష్కారం కోసం నిజాయతీతో కృషి చేశారు. రాజ్యాంగ పరిధిలోనే కశ్మీర్ సమస్య పరిష్కరించబడుతుందా? అని ఒకరు అడిగితే, దానికి ఆయన, అది జంహూరియత్ (ప్రజాస్వామ్యం), ఇన్సానియత్ (మానవత్వం) ఆధారంగా పరిష్కరించబడుతుందని సమాధానం ఇచ్చారు. ఇది ఒక కొత్త ఆలోచన. రాజకీయాలపట్ల, సాధారణంగా జీవితంపట్ల ఆయనకున్న దృక్పథానికి ప్రతీక. నేటి ప్రతికూల రాజకీయాల కాలంలో అందరికీ మార్గదర్శిగా ఉంటుంది. శ్రీనగర్‌లో ఇప్పటి వరకు మరే ప్రధాని ప్రసంగించని అతిపెద్ద బహిరంగ సభలో ప్రసంగించడం ఆయన ఆ ప్రాంత ప్రజల విశ్వాసం ఎంతగా చూరగొన్నారో వెల్లడి చేస్తుంది.
జాతీయ ప్రయోజనాల విషయం లో రాజీలేని ధోరణులు అవలంబించిన వాజపేయి ఏనాడూ అవకాశవాద రాజకీయాలకు ఆస్కారం ఇవ్వలేదు. జనతా పార్టీ విచ్ఛిన్నం కోసం ద్వంద్వ సభ్యత్వం వివాదాన్ని రేపిన సమయంలో ఆర్‌ఎస్‌ఎస్‌తో సంబంధాలు తెంచుకుంటే అధికారంలో కొనసాగవచ్చనే ప్రతిపాదనలను ఏమాత్రం ఆలోచింపకుండా తిరస్కరించారు. తన సైద్ధాంతిక మూలాలను వదులుకునేందుకు సిద్ధపడలేదు. ఎల్‌కె అద్వానీ చేపట్టిన శ్రీరామ రథయాత్ర విషయం భిన్నాభిప్రాయం ఉన్నప్పటికీ ఆయనను అప్పటి లాలూ ప్రసాద్ యాదవ్ ప్రభుత్వం బీహార్‌లో అరెస్ట్ చేయగానే, ఆ యాత్రను కొనసాగించేందుకు వాజపేయి బయలుదేరారు. అయితే, లక్నో విమానాశ్రయంలోనే ఆయనను కూడా అరెస్ట్ చేశారు. ఆయన ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రయోగించి, దేశచరిత్రలోనే లేనివిధంగా కేవలం ఒక ఓటు తేడాతో అధికారం కోల్పోవలసి వచ్చిన సమయంలో కూడా ప్రజలపట్ల తన అపారమైన విశ్వాసాన్ని కోల్పోలేదు. ఎంపిలను కొనుగోలు చేసి తన అధికారం నిలబెట్టుకునే ప్రయత్నం చేయలేదు. తిరిగి ప్రజల వద్దకు వెళ్లి వారి సంపూర్ణ మద్దతుతో తిరిగి వస్తానని లోక్ సభలో స్పష్టం చేసి, తన పదవికి రాజీనామా చేశారు. కానీ అనైతిక పద్ధతులకు మొగ్గు చూపలేదు. వాజపేయి భారత రాజకీయాలలో ఓ వినూత్న ఒరవడిని సృష్టించారు.
చలసాని నరేంద్ర
98495 69050