మన తెలంగాణ/హైదరాబాద్:“నేను బిఆర్‌ఎస్‌లో లేను, కాంగ్రెస్‌లోనే ఉన్నా..” అ ని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. బిఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించారని ఆరోపణ ఎదుర్కొంటున్న దానం నాగేందర్ బుధవారం ఒక అడుగు ముందుకేసి తాను కాంగ్రెస్‌లో ఉన్నానని తేల్చి చెప్పారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరు ఎక్కడ ఉన్నారో తనకు తెలియదు కానీ తాను మాత్రం కాంగ్రెస్‌లో ఉన్నానని ఆ యన బుధవారం మీడియాతో మాట్లాడుతూ అన్నారు. రాబోయే జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో 300 డివిజన్లలో కాంగ్రెస్- మజ్లీ స్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించేలా తాను అన్ని డివిజన్లలో ప్రచారం చేస్తానని దానం నాగేందర్ తెలిపారు. రెండేళ్ళ క్రి తం సార్వత్రిక ఎన్నికలు ముగిసిన అనంత రం పది మంది బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వే ర్వేరు సందర్భాల్లో కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. అయితే వీరిపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేయాల్సిందిగా బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు.
కాగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇటీవల ఐదుగురు ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, అరికెపూడి గాంధీ పార్టీ ఫిరాయించలేదని, వారు బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలేనని తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. వారు పార్టీ ఫిరాయించినట్లు పిటిషనర్లు సరైన సాక్షాధారాలు చూపించలేదన్నారు.మిగతా ఐదుగురు ఎమ్మెల్యేలలో ముగ్గురు ఎమ్మెల్యేలు కె. సంజయ్, కాలె యాదయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డిపై స్పీకర్ తన తీర్పు వెలువరించాల్సి ఉంది. కాగా, దానం నాగేందర్, కడియం శ్రీహరికి లోగడ స్పీకర్ కార్యాలయం నుంచి నోటీసులు వెళ్ళగా, తమకు సమాధానం చెప్పేందుకు కొంత గడువు కావాలని వారిరువురు కోరారు. తాజాగా కడియం శ్రీహరి స్పీకర్ ప్రసాద్ కుమార్‌ను కలిసి తనకు గడువు కావాలని కోరగా, దానం నాగేందర్ గడువు కోరకుండా, తాను కాంగ్రెస్ ఎమ్మెల్యేనని గట్టిగా చెప్పారు.
కాంగ్రెస్ నుంచి ఎంపీగా..
బిఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన దానం నాగేందర్ ఆ తర్వాత కొంత కాలానికే వచ్చిన లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. బహిరంగ రహస్యమే అయినందున, తాను పార్టీ ఫిరాయించలేదని చెప్పేందుకు ఆస్కారమే లేదు. ఈ నేపథ్యంలోనే దానం ధైర్యంగా తాను పార్టీ ఫిరాయించానని, కాంగ్రెస్‌లో ఉన్నానని ఘంటాపథంగా చెప్పారు. దీంతో స్పీకర్ నిర్ణయానికి ముందే దానం తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తారేమోనన్న ఊహగానాలు కొనసాగుతున్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని కైవసం చేసుకున్నట్లు ఖైరతాబాద్‌నూ కైవసం చేసుకోవచ్చని కాంగ్రెస్ నాయకులు ధీమాగా ఉన్నారు.