అహ్మదాబాద్: విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా బుధవారం జార్ఖండ్‌తో జరిగిన గ్రూప్‌ఎ మ్యాచ్‌లో కర్ణాటక 5 వికెట్ల తేడాతో రికార్డు విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన జార్ఖండ్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 412 పరుగులు సాధించింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ విధ్వంసక సెంచరీ సాధించాడు. కర్ణాటక బౌలర్లను హడలెత్తించిన ఇషాన్ 39 బంతుల్లో 14 భారీ సిక్సర్లు, ఏడు ఫోర్లతో 125 పరుగులు చేశాడు. విరాట్ సింగ్ (88), కుశాగ్రా (63) తమవంతు సహకారం అందించారు. తర్వాత బ్యాటింగ్ చేపట్టిన కర్ణాటక 47.3 బంతుల్లోనే ఐదు వికెట్లు కోల్పోయి సంచలన విజయం సాధించింది. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (54), అభినవ్ మనోహర్ (56) నాటౌట్, ధ్రువ్ ప్రభాకర్ 40 (నాటౌట్) మెరుగైన ప్రదర్శనతో జట్టును ఆదుకున్నారు. ఇక అద్భుత ఇన్నింగ్స్ ఆడిన ఓపెనర్ దేవ్‌దుత్ పడిక్కల్ 118 బంతుల్లోనే 10 ఫోర్లు, ఏడు సిక్సర్లతో 147 పరుగులు చేసి విజయంలో ముఖ్యభూమికను పోషించాడు.
హైదరాబాద్ ఓటమి
హైదరాబాద్ టీమ్ విజయ్ హజారే ట్రోఫీ ఆరంభ మ్యాచ్‌లో ఓటమి పాలైంది. బుధవారం జరిగిన గ్రూప్‌సి మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్ టీమ్ 84పరుగుల తేడాతో హైదరాబాద్‌ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన యుపి 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 324 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన హైదరాబాద్ 240 పరుగులకే కుప్పకూలింది.