న్యూఢిల్లీ : ఢిల్లీ కాలుష్యంపై కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడ ఉన్న మూడు రోజుల్లోనే తనకు అలర్జీ వచ్చిందని వెల్లడించారు. దేశ రాజధానిలో జరిగిన ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. “నేను ఇక్కడ మూడు రోజులుగా ఉంటున్నాను. ఈ కాలుష్యం వల్ల నాకు అలర్జీ వచ్చింది. నేను రవాణా శాఖ మంత్రిగా ఉన్నాను. రవాణా వల్లే 40 శాతం కాలుష్యం వస్తోంది. శిలాజ ఇంధనాల వాడకాన్ని గణనీయంగా తగ్గించాల్సిన అవసరం ఉంది. శిలాజ ఇంధనాలు పరిమితంగా ఉన్నాయి. కానీ కాలుష్యం మాత్రం పెరిగిపోతోంది. మనం వాటి వాడకాన్ని తగ్గించలేమా ? కాలుష్యాన్ని తగ్గించే ఎలక్ట్రిక్ వాహనాలు, హైడ్రొజన్ ఆధారిత వాహనాలకు ప్రోత్సాహం లభించాలి ” అని గడ్కరీ వ్యాఖ్యలు చేశారు. భారత దేశం శిలాజ ఇంధనాలపై ఏటా దాదాపు రూ.22 లక్షల కోట్లు ఖర్చు చేస్తోంది.
కేంద్ర మంత్రి ఇథనాల్ వాడకాన్ని ప్రోత్సహిస్తోన్నసంగతి తెలిసిందే. ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా తయారు చేసిన తొలి ఫ్లెక్స్‌ఫ్యూయర్ కారును ఇప్పటికే నితిన్‌గడ్కరీ ఆవిష్కరించారు. పెట్రోల్, ఇథనాల్ కలిపి వినియోగించడాన్నే ఫ్లెక్స్ ఫ్యూయర్ అని పిలుస్తారు. ఇది కాలుష్యాన్ని, శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తుందని మంత్రి పేర్కొన్నారు. గతం లోనూ నితిన్ గడ్కరీ ఢిల్లీ కాలుష్యం గురించి మాట్లాడారు. “ నేను రెండు లేదా మూడు రోజులు మాత్రమే ఢిల్లీలో ఉంటాను. ఇక్కడికి వచ్చినప్పుడు ఎప్పుడెప్పుడు వెళ్లిపోదామా అని ఆలోచిస్తుంటా. నేను ముందే రిటర్న్ టికెట్లను బుక్ చేసుకుంటా” అని వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.