శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో ఘనత సాధించింది. వాణిజ్య ప్రయోగాల్లో కీలక మైలురాయిని అందుకుంది. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి బుధవారం చేపట్టిన బాహుబలి రాకెట్ ‘ఎల్‌వీఎం3ఎం 6’ ప్రయోగం విజయవంతమైంది. ఈ ప్రయోగంతో అమెరికాకు చెందిన అధునాతన కమ్యూనికేషన్ ఉపగ్రహం ‘బ్లూ బర్డ్ బ్లాక్ 2’ ను ఇస్రో విజయవంతంగా కక్షలోకి ప్రవేశ పెట్టింది. ఈ ఉపగ్రహం బరువు సుమారు 6100 కిలోలు. ఇంతటి భారీ ఉపగ్రహ ప్రయోగం చేపట్టడం ఇస్రో కు ఇదే తొలిసారి. అమెరికాకు చెందిన ఏఎస్‌టీ స్పేస్ మొబైల్ సంస్థతో కలిసి ఇస్రో వాణిజ్య విభాగం న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ ఈ ప్రయోగాన్ని నిర్వహించింది.
తొలుత ఉదయం 8.54 గంటలకు ఈ ప్రయోగాన్ని షెడ్యూల్ చేశారు. అయితే సాంకేతిక కారణాల రీత్యా 90 సెకన్ల పాటు వాయిదా వేశారు. ఉదయం 8.55.30 గంటలకు 43.5 మీటర్ల పొడవైన ఎల్‌వీఎం 3ఎం6 రాకెట్ నిప్పులు కక్కుతూ నింగిలోకి దూసుకెళ్లింది. మొత్తం మూడు దశల్లో ఈ ప్రయోగం పూర్తయింది. భూమి నుంచి బయల్దేరిన 15 నిమిషాల తర్వాత బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహం వ్యోమనౌక నుంచి విడిపోయి 520 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్షలో విజయవంతంగా చేరింది. శాటిలైట్ల నుంచి నేరుగా మొబైల్ కనెక్టివిటీ అందించాలనే లక్షంగా బ్లూబర్డ్ బ్లాక్2 మిషన్ చేపట్టారు. దీని సాయంతో ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఏ సమయానికైనా ఎవ్వరికైనా 4జి, 5జి వాయిస్ వీడియో కాల్స్ , సందేశాలు,ప్రసారాలు అందించాలని అమెరికా సంస్థ భావిస్తోంది.
అత్యుత్తమ ప్రయోగాల్లో ఒకటి : ఇస్రో
ఈ ప్రయోగం అనంతరం ఇస్రో ఛైర్మన్ డాక్టర్ వి. నారాయణన్ మాట్లాడారు. “ బాహుబలి ప్రయోగం విజయవంతమైంది. శాస్త్రవేత్తలందరికీ అభినందనలు. ఎల్‌వీఎం ప్రయోగాల్లో నూరు శాతం విజయాలు సాధిస్తున్నాం. అతి తక్కువ సమయంలో రాకెట్ రూపొందించి విజయవంతంగా ప్రయోగించాం. భారత భూమి నుంచి పైకెగసిన అతి భారీ రాకెట్ ఇదే. ప్రపంచం లోనే అత్యుత్తమ ప్రయోగాల్లో ఇది ఒకటి. అమెరికా కస్టమర్ కోసం దీన్ని చేపట్టాం. ఇస్రో ప్రస్తుతం 34 దేశాలకు సేవలందిస్తోంది. గగన్‌యాన్ కోసం సిద్ధమవుతోన్న వేళ ఈ ప్రయోగం మరింత ఆత్మ విశ్వాసం కలిగిస్తోంది. ఇస్రో చేతిలో చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. ” అని నారాయణన్ ఆనందం వ్యక్తం చేశారు.
ప్రధాని మోడీ అభినందనలు
ఎల్‌వీఎం3ఎం6 రాకెట్ ప్రయోగం విజయవంతం అవడంపై ప్రధాని నరేంద్రమోడీ హర్షం వ్యక్తం చేశారు. శాస్త్రవేత్తలకు అభినందనలు తెలియజేశారు. ప్రపంచ వాణిజ్య ప్రయోగాల్లో భారత్ మరోసారి సత్తా చాటిందని ఇస్రోను కొనియాడారు. అంతరిక్ష రంగంలో మనదేశం అత్యున్నత స్థానానికి ఎదుగుతూనే ఉందన్నారు. ఈ విజయం ఆత్మనిర్భర్ భారత్ వైపు మన ప్రయత్నాలను ప్రతిబింబిస్తోందంటూ ఎక్స్‌లో రాసుకొచ్చారు.