తాను ఎవరూ వదిలిన బాణం కాదని, ప్రజలు వదిలిన బాణం అని ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. తనను ఆపరేట్ చేసే అంత సీన్ ఎవరికీ లేదన్నారు. 2029 ఎన్నికల్లో స్వతంత్రంగానే పోటీ చేస్తానని ఆమె ప్రకటించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని వివేరా హోటల్లో జాగృతి ’జనం బాట’ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమే సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను మళ్ళీ బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా పార్టీలోకి రావాలని పిలిచినా వెళ్ళేది లేదన్నారు. కారణం చెప్పకుండా తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై ఆమె మరోసారి తన ఆవేదన వెలిబుచ్చారు. తాను చేసిన తప్పు ఏమిటో చెప్పకుండా తనను సస్పెండ్ చేసి బయటకు గెంటేశారని ఆవేదన వ్యక్తంచేశారు.
ఇప్పటివరకు 16 జిల్లాలను పర్యటించి ప్రజా సమస్యలను అధ్యయనం చేస్తూ, వాటిపై పోరాటానికి కార్యాచరణ రూపొందిస్తున్నానని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక్క ఎకరానికి కూడా నీరు అందలేదని ఆమె విమర్శించారు. పెద్దల భూములు కాపాడేందుకు ట్రిపుల్ ఆర్ కోసం పేదల భూములను బలవంతంగా లాక్కున్నారని కవిత మండిపడ్డారు. రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టు నిర్వాసిత రైతుల సమస్యలపై రైతుల పక్షాన తాను పోరాటం చేస్తానని అన్నారు. రాయిగిరి, బిఎన్ తిమ్మాపురం, బస్వాపూర్ వంటి ప్రాంతాల రైతులతో కలిసి మాట్లాడానని బస్వాపురం ప్రాజెక్టు రీడిజైన్ పేరుతో చిన్న రిజర్వాయర్‌ను పెద్దదిగా మార్చి రైతుల భూములు లాగేసుకున్నారని ఆరోపించారు. భూములు ఇండ్లు కోల్పోయిన బాధలో రైతులు ఉంటే వారికి రావాల్సిన పరిహారం ఇవ్వకుండా మోసం చేస్తున్నారని మండిపడ్డారు.