విజయ్ హజారే వన్డే ట్రోఫీలో బిహార్ టీమ్ అత్యంత అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. బుధవారం రాంచి వేదికగా అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో బిహార్ 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 574 పరుగుల రికార్డు స్కోరును సాధించింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగినవ్ అరుచాచల్ ప్రదేశ్‌ను 42.1 ఓవర్లలో 177 పరుగులకే ఆలౌట్ చేసి 397 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో బిహార్ ఆటగాళ్లు వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ లోహరుక, సకిబుల్ గని కళ్లు చెదిరే శతకాలు సాధించారు. దీంతో బిహార్ విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలోనే భారీ స్కోరును నమోదు చేసింది. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన వైభవ్ సూర్యవంశీ 84బంతుల్లోనే 15 సిక్సర్లు, 16 బౌండరీలతో ఏకంగా 190 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో 36 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.ఆయుష్ కూడా మెరుపు శతకం సాధించాడు.
ప్రత్యర్థి జట్టు బౌలర్లను హడలెత్తించిన ఆయుష్ 56 బంతుల్లోనే 11 ఫోర్లు, 8 సిక్సర్లతో 116 పరుగులు చేశాడు. ఇక ఆకాశమే హద్దుగా చెలరేగి పోయిన సకిబుల్ గని 32 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ప్రత్యర్థి జట్టు బౌలర్లపై విరుచుకు పడిన సకిబుల్ 40 బంతుల్లోనే 12 సిక్సర్లు, 10 ఫోర్లతో అజేయంగా 128 పరుగులు సాధించాడు. పీయూష్ సింగ్ (77) కూడా అర్ధ సెంచరీతో మెరిశాడు. దీంతో బిహార్ భారీ స్కోరును నమోదు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన అరుణాచల్ ప్రదేశ్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో బిహార్ బౌలర్లు సఫలమయ్యారు. ఆకాశ్ రాజ్, సూరబ్ కశ్యప్ తలో మూడేసి వికెట్లను పడగొట్టారు. హిమాన్షుకు రెండు వికెట్లు దక్కాయి.