ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి మాజీ సిఎం, బిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై ఫైరయ్యారు. కెసిఆర్ వాఖ్యలకు కౌంటర్ ఇస్తూ.. 2029లో 80 శాతానికి పైగా సీట్లతో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందన్నారు. కెసిఆర్ ఉడత ఊపులకు భయపడేవాడిని కాదన్నారు. పార్టీ ఆఫీసులో కాదు.. అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు అసెంబ్లీ పెడతానని.. కూలిన కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ అనేక అంశాలపై చర్చిద్దాం రా అంటూ సిఎం రేవంత్, కెసిఆర్ కు సవాల్ విసిరారు. తాను రాజకీయాల్లో ఉన్నంతకాలం కల్వకుంట్ల కుటుంబాన్ని అధికారంలోకి రానివ్వనన్నారు. వాటా ఇవ్వాల్సి వస్తుందనే సొంత బిడ్డను, అల్లుడిని వెల్లగొట్టిండని కెసిఆర్ పై సిఎం రేవంత్ రెడ్డి విమర్శించారు.
‘‘పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు. కెసిఆర్ సిఎం అయినా.. కొడంగల్‌కు నీళ్లు రానివ్వలేదు. పాలమూరు, కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు ప్రాజెక్టులు పూర్తి చేయలేదు. కృష్ణా నదిపై ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు.. ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదు. పదేళ్లలో కాంట్రాక్టర్లకు రూ.1.83 లక్షల కోట్ల బిల్లులు మాత్రం చెల్లించారు. కమీషన్ల రూపంలో రూ.వేల కోట్లు కెసిఆర్ కుటుంబం పొందింది. చెప్పులు లేకుండా తిరిగిన వాళ్లకు బిఆర్ఎస్ పాలనలో బెంజ్ కార్లు వచ్చాయి. మొత్తం రూ.8 లక్షల కోట్ల అప్పు మిగిల్చి పోయారు. ఒకరికి ఎర్రవల్లిలో వెయ్యి ఎకరాల ఫాంహౌస్ వచ్చింది. మరొకరికి జన్వాడలో వందెకరాల ఫాంహౌస్ వచ్చింది. కెసిఆర్ అల్లుడికి మొయినాబాద్‌లో ఫాంహౌస్ వచ్చింది. తెలంగాణలో కెసిఆర్ కుటుంబం మాత్రం బాగుపడింది. కెసిఆర్ కుటుంబానికి రూ.వేల కోట్ల వ్యాపారాలు వచ్చాయి’’ అని సిఎం రేవంత్ అన్నారు.