మన తెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వ విభాగాలన్నీ సమన్వయంతో సమర్థవంతంగా పని చేస్తే తెలంగాణ రైజింగ్ విజన్ 2047 భవిష్యత్తు లక్ష్యాలను అలవోకగా సాధించగలమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చే శారు. విజన్ అంటే కేవలం ప్రచారానికి పరిమితమనే అపోహను తిప్పికొట్టే లా విజన్‌లో ఉన్న ప్రతి అంశం అమలు చేసేందుకు నడుం బిగించాలని అన్ని విభాగాల ఉన్నతాధికారులకు సిఎం అప్రమత్తం చేశారు. రాష్ట్రానికి ఒక భవిష్యత్తు ప్రణాళిక, కార్యాచరణ దిశగా ప్రభుత్వం అమలు చేస్తున్న క్యూర్, ప్యూర్, రేర్ అభివృద్ధికి అన్ని విభాగాలు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో సిఎస్ రామకృష్ణారావు, స్పెషల్ సిఎస్‌లు, సిఎంఓ అధికారులు, అన్ని శాఖల ప్రిన్సిపల్ సెక్రెటరీలు, సెక్రెటరీలతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ రెండేళ్లలో కొన్ని విజయాలు సాధించాం, కొన్ని ప్రణాళికలు రూపొందించుకున్నాం. గతంలో ఎనర్జీ, ఎడ్యుకేషన్, ఇరిగేషన్, హెల్త్ లాంటి వివిధ శాఖలకు సంబంధించి ఒక పాలసీ లేకపోవడంతో కొన్ని సమస్యలు వచ్చాయి. అందుకే ముఖ్యమైన విభాగాల్లో పాలసీలు అమలు చేశామని అన్నారు. రాష్ట్రానికి పాలసీలతో పాటుల
భవిష్యత్తు ప్రణాళిక ఉండాలని తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను విడుదల చేసుకున్నామని సిఎం గుర్తు చేశారు. రాష్ట్రాన్ని క్యూర్, ప్యూర్, రేర్ గా విభజించి అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించుకుంటున్నామని చెప్పారు. ప్రభుత్వం ఎంత గొప్ప కార్యాచరణ తీసుకున్నా, అది నూటికి నూరు పాళ్లు విజయవంతం కావాలంటే అధికారుల సహకారం ఉండాలని అభిప్రాయపడ్డారు. ఇప్పటికంటే పనితీరు మరింత మెరుగుపరుచుకోవాలని సిఎం అధికారులను సూచించారు. పనితీరులో మార్పు రాకపోతే, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే గరం, నరం, బేషరమ్ గా వ్యవహరించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇకపై ప్రతీ నెల కార్యదర్శుల పనితీరుపై సమీక్ష ఉంటుందని, కార్యదర్శులందరూ తమ పనితీరు, శాఖల పురోగతిపై సిఎస్ కు ప్రతీ నెల రిపోర్ట్ సమర్పించాలని ఆదేశించారు. ప్రతీ మూడు నెలలకు ఒకసారి మీ పనితీరుపై స్వయంగా తాను సమీక్ష నిర్వహిస్తానని సిఎం అన్నారు. ఐఎఎస్ అధికారులు ప్రతి పది రోజులకోసారి క్షేత్రస్థాయికి వెళ్లాలని, నెలలో కనీసం మూడు సార్లు తమ శాఖ పరిధిలో ఏం జరుగుతుందో క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాలని సిఎం ఆదేశించారు. అన్ని విభాగాల ఉన్నతాధికారులు జవాబుదారీతనంతో పని చేయాలన్నారు.
శాఖల మధ్య, శాఖల అధికారుల మధ్య సమన్వయం లేకపోతే ఆశించిన ఫలితాలు రావని ముఖ్యమంత్రి అన్నారు. అభివృద్ధి విషయంలో శాఖల మధ్య సమన్వయం చేసుకునేందుకు ఒక మెకానిజం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. రైజింగ్ విజన్ అమలుకు అన్ని విభాగాలు నిర్దిష్టమైన కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సిఎం రేవంత్రెడ్డి అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, ఉన్నతాధికారులకు దిశా నిర్దేశం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ విభాగాలు, శాఖల్లో రెగ్యులర్, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన దాదాపు 10 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారని అన్నారు. ఉద్యోగులకు సంబంధించిన పూర్తి వివరాలు జనవరి 26 లోగా సిఎస్ కు అందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు అందాల్సిన జీతాలు, ఈపిఎఫ్ అందుతున్నాయో లేదో సంబంధిత శాఖల అధికారులు పరిశీలించాలని కోరారు. ఉద్యోగాల డేటా విషయంలో పూర్తి బాధ్యతను అధికారులదేనని సిఎం హెచ్చరించారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రమంతటా ప్రభుత్వ కార్యాలయాలు ఇకపై అద్దె భవనాల్లో ఉండకూడదని సిఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. జనవరి 26 లోపు అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ ఆఫీసులను ఖాళీ చేసి, అందుబాటులో ఉన్న ప్రభుత్వ భవనాల్లోకి మార్చాలని ఆదేశించారు. ఖాళీ భవనాలు అందుబాటులో లేకపోతే, అందుబాటులో ఉన్న ఖాళీ స్థలాలను గుర్తించాలన్నారు. ఖాళీ స్థలాల్లో సొంత భవనాల నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేయాలని చెప్పారు. నిర్ణీత గడువులోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. రాష్ట్రంలో ఉన్న 113 మున్సిపల్ ఆఫీసులకు సొంత భవనాలున్నాయా, ఎక్కడెక్కడ అద్దె భవనాలున్నాయో వెంటనే గుర్తించి నివేదిక అందించాలన్నారు.
ప్రజలకు సేవలందించే ఆఫీసులు పట్టణాల్లో అందరికీ అందుబాటులో ఉండేలా కొత్త భవనాలు నిర్మించాలని ఆదేశించారు. ఇతర విభాగాలు, శాఖలకు చెందిన భవనాలుంటే వాటిని వినియోగించుకోవాలని, లేదంటే ఖాళీగా ఉన్న స్థలాలను గుర్తించి వెంటనే నిర్మాణాలకు అంచనాలు రూపొందించాలని ముఖ్యమంత్రి చెప్పారు. మున్సిపల్ ఆఫీసులతో పాటు అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ బిసి, ఎస్‌సి, ఎస్‌టి, మైనారిటీ హాస్టళ్లు, అంగన్వాడీలు అన్నింటికీ సొంత భవనాలు ఉండేలా వెంటనే ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. అందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం మంజూరు చేస్తుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల (సిఎస్‌ఎస్) నుంచి వచ్చే నిధులను అన్ని శాఖలు సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు వాటాగా చెల్లిస్తే, కేంద్రం దాదాపు 60 శాతం ఈ పథకాలకు నిధులు ఇస్తుందన్నారు. ఈ పథకాలతో దాదాపు రూ.3 వేల కోట్లు తెచ్చుకునే వీలుందని, అందుకు వీలుగా అన్ని శాఖలు వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేసుకోవాలని, కేంద్ర ప్రభుత్వ విభాగాలతో సంప్రదింపులు జరపాలని ఆదేశించారు. సిఎస్‌ఎస్ నుంచి వచ్చే నిధులకు అవసరమైన రాష్ట్ర వాటాను ఎప్పటికప్పుడు విడుదల చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించారు.కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అనుమతులు, వివిధ విభాగాలకు సంబంధించి కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న అంశాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాలని, వాటి పురోగతిని ప్రతి వారం సమీక్షించుకోవాలని సిఎం ఆదేశించారు.
జనవరి 31లోగా అన్ని ప్రభుత్వ శాఖలు ఈ ఫైలింగ్ సిస్టమ్ అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గడువు నిర్ణయించారు. కాగితాలు, ఫైళ్లు పట్టుకొని తిరిగే పరిస్థితి ఉండకుండా అన్ని ఆన్‌లైన్‌లోనే జరగాలని సిఎం ఆదేశించారు. అన్ని విభాగాలు తమ శాఖ పరిధిలోని కార్యక్రమాల అమలుకు సంబంధించి డాష్ బోర్డు సిద్ధం చేయాలని చెప్పారు. డాష్ బోర్డును సిఎస్, సిఎంఓ డాష్ బోర్డులకు అనుసంధానం చేయాలని సూచించారు. దీంతో అన్ని శాఖల పర్యవేక్షణ సులభతరం అవుతుందని, పనితీరు మెరుగుపడుతుందని సిఎం అన్నారు. రాష్ట్రానికి వెల్లువలా వచ్చిన పెట్టుబడులు ఎంత మేరకు గ్రౌండయ్యాయి, వాటి పురోగతిని ప్రతి నెలా సమీక్షించుకోవాలని సిఎం అధికారులను అప్రమత్తం చేశారు. పరిశ్రమలకు అవసరమైన భూసేకరణ, భూ కేటాయింపులకు అవసరమైన మేరకు ప్రత్యేకంగా అధికారులను నియమించాలని సూచించారు. కోర్ అర్బన్ ఏరియాలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. కార్పొరేట్ తరహాలో సర్కారు స్కూళ్లలో నమోదు శాతం పెంచేందుకు రవాణా సదుపాయం, బ్రేక్ ఫాస్ట్, మిడ్ డే మీల్స్ అమలు దిశగా ప్రణాళికలుండాలని సూచించారు. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నింటా టీచింగ్ హాస్పిటల్స్‌ను అద్భుతమైన వైద్యసేవలందించేలా తీర్చిదిద్దాలని సిఎం సూచించారు. నిమ్స్ తరహాలో సనత్‌నగర్, కొత్తపేట, అల్వాల్ టిమ్స్, వరంగల్ హాస్పిటళ్లు, ఉస్మానియా కొత్త ఆసుపత్రి ప్రజలకు మెరుగైన వైద్యం అందించేలా అన్ని వసతులతో తీర్చిదిద్దాలని కోరారు. మెడికల్ కాలేజీ హాస్పిటల్స్‌కు కూడా ఆరోగ్య శ్రీ, సిఎంఆర్‌ఎఫ్ అనుసంధానం చేయాలని సూచించారు. అక్కడ సేవలందించే వైద్యులకు, సిబ్బందికి కూడా సర్జరీలు, ప్రత్యేక సేవలకు ఇన్సెటివ్‌లు ఇవ్వాలని అన్నారు.