మన తెలంగాణ/హైదరాబాద్: గోబెల్స్ ప్రచారం లో బీఆర్‌ఎస్ దిట్ట అని భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి విమర్శించారు. ఈ మేరకు ఆయన మంగళవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ వాళ్లకే తెలివితేటలు ఉ న్నట్లు, అవగాహన ఉన్నట్లు, గొప్పలు సాధించిన ట్లు ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. బిఆర్‌ఎస్ పాలనలో పాలమూరు ప్రాజెక్టును పడా వు పెట్టారని, మేం వచ్చాక ప్రాజెక్టు పనులను పరు గులు తీయిస్తున్నామని ఉత్తమ్ ప్రకటించారు. పదే ళ్ల బీఆర్‌ఎస్ పాలనలో మొత్తం బడ్జెట్ రూ. 17.72 లక్షల కోట్లు అని, ఇరిగేషన్‌పై ఖర్చుపెట్టింది రూ.1.83లక్షల కోట్లు మాత్రమే అని తెలిపారు. అది హై ఇంట్రెస్ట్ లోన్ తీసుకొచ్చి ఖర్చు పెట్టారని తెలిపారు. పోనీ తీసుకొచ్చిన అప్పుల వల్ల ఎలాం టి ప్రయోజనం జరగకపోగా నష్టమే ఎక్కువ జరిగిందని, ఏడాదికి రూ.16 వేల కోట్లు అప్పు కడుతున్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 90 శాతం పనులు పూర్తి చేశామని కేసీఆర్, హరీశ్ చెబుతున్నారని, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై బీఆర్‌ఎస్ రూ.27 వేల కోట్లు ఖర్చు పెట్టిందని తెలిపారు. కానీ ఒక్క ఎకరాకు కూడా బీఆర్‌ఎస్ ప్రభు త్వం సాగునీరు ఇవ్వలేదని మంత్రి ఉత్తమ్ అన్నా రు. బీఆర్‌ఎస్ నాయకులు దుర్మార్గంగా బరి తెగించి అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. పాలమూరు ప్రాజెక్ట్ కోసం రెండేళ్లలో 7వేల కోట్లు ఖర్చు చేశామని, పాలమూరు ప్రాజెక్ట్ కోసం ఏ అనుమతులు లేవని, కేసీఆర్ అబద్ధాలు చెప్పారని వివరించారు. 45 టీఎంసీకి ఒప్పుకున్నారనేది అవాస్తవమని, హరీష్ తెలివితో మాయమాటలు చెబుతున్నారన్నారు.
హరీష్ రావు విచిత్ర, వికారం మాటలను ఖండిస్తున్నామని, కేసీఆర్ ప్రభుత్వానికి పాలమూరు కట్టాలని లేదని విమర్శించారు. 2020లో సెంట్రల్ కు పంపిన నీటి వాటాల పంపకాల్లో పాలమూరు, ఎస్‌ఎల్‌బిసి, డిండికి నీళ్లు అడగలేదని, పదేళ్లలో బిఆర్‌ఎస్ తెలంగాణ ప్రజలను మోసం చేసిందని ధ్వజమెత్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కట్టిన ప్రాజెక్టులతోనే నీళ్లను పంపిణి చేశారని, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పేరుతో ఏపీ నీటి దోపిడీకి కేసీఆర్ సహకరించారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పనులను నిలిపివేశామని, వచ్చే మూడేళ్లలో ఎస్‌ఎల్‌బిసి ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వంలో పాలమూరుకు ఖర్చుచేసిన రూ.7వేల కోట్ల లెక్కలు చెబుతామని, హరీష్ రావు కమిషన్లు అంటున్నారని, వారి అలవాట్లు తమకు లేవని ఎద్దేవా చేశారు. ఏదో అద్భుతాలు చేసినట్లు కేసీఆర్ ఫ్యామిలీ వ్యాఖ్యలు ఉంటాయని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. వారి పాలనలో రూ. 27,000 కోట్లు ఖర్చు చేసినప్పటికీ కేవలం 35 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయని ఆయన వెల్లడించారు. ప్రాజెక్ట్ 90 శాతం పనులు పూర్తయితే మరి ఒక్క ఎకరానికి కూడా సాగునీరు ఎందుకు అందలేదని ఆయన నిలదీశారు. కేవలం ఫోటోల కోసం ఒక మోటార్ ఆన్ చేసి ఆ తర్వాత వెంటనే బంద్ చేశారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 11 మోటార్లను సిద్ధం చేశామని మంత్రి వివరించారు. ప్రాజెక్టు అంచనాలపై స్పందిస్తూ డీపీఆర్ విలువ రూ. 55,000 కోట్లుగా ఉందని, దీనికి అదనంగా భూసేకరణ కోసం మరో రూ. 6,000 కోట్లు అవసరమవుతాయని ఉత్తమ్ తెలిపారు. ఇంకా 30,000 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉందన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో కనీసం ఒక్క డిస్ట్రిబ్యూటరీ కాలువను కూడా నిర్మించలేదని, కాలువలే లేకుండా సాగునీరు ఎలా సరఫరా చేస్తామని వారు చెప్పుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై ఉన్న ప్రేమతోనే పక్కన పెట్టారు
కాళేశ్వరం ప్రాజెక్టుపై ఉన్న ప్రేమతోనే మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోని పెండింగ్ ప్రాజెక్టులను గత ప్రభుత్వం పక్కన పెట్టిందని ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. కేంద్రానికి రాసిన లేఖలపై క్లారిటీ ఇస్తూ 90 టీఎంసీల నీటి కేటాయింపుల కోసమే తాము డీపీఆర్ అనుమతులు అడిగామని, ఎక్కడా తక్కువ నీరు అడగలేదని ఉత్తమ్ స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో సాంకేతిక, పర్యావరణ అనుమతులు ఏవీ సాధించకుండానే సాధించామని ప్రజలను తప్పుదోవ పట్టించారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే కృష్ణా జలాల వినియోగం పెరిగిందని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల పేరుతో అధిక వడ్డీలకు రుణాలు తీసుకుని రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని ఉత్తమ్ విమర్శించారు. వేల కోట్ల అప్పులు చేసినా ఒక్క ఎకరాకు కూడా అదనంగా నీరు అందించలేకపోయారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండేళ్లలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం రూ. 7,000 కోట్లు ఖర్చు చేసి పనులను పరుగులు పెట్టిస్తోందని ఆయన వివరించారు. 2021లోనే ప్రాజెక్టు పనులను జాప్యం చేయాలని కేసీఆర్, హరీష్ రావులు ఆదేశాలు ఇచ్చారని, ఇప్పుడు మాత్రం రాజకీయ లబ్ధి కోసం విమర్శలు చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు.