న్యూఢిల్లీ: కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా ఎప్పటికైనా ప్రధాని అవుతారా?.. అవును అంటున్నారు చాలా మంది జనం. వరుస ఓటములతో రాహుల్ గాంధీ పై కాంగ్రెస్ విశ్వాసం కోల్పోయిందని ఇప్పటికే బీజేపీ ఆరోపిస్తోంది కాగా, మంగళవారం రాబర్ట్ వాద్రా తన భార్య ప్రియాంక గాంధీ ఎప్పటికైనా ప్రధాని అవుతుందన్న విశ్వాసం వ్యక్తం చేయడంతో తాజా చర్చకు తెరలేచింది. ఇందిరా గాంధీ మాదిరిగా పోలికలు ఉన్న ప్రియాంకను ప్రధానిగా చూడాలని చాలామంది కోరుకుంటున్నారని, ఇది కాలమే నిర్ణయించాలని రాబర్ట్ వాద్రా అన్నారు. ప్రియాంక తన నాన్నమ్మ మాదిరిగా బలమైన ప్రధానిగా నిరూపించుకుంటారని కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా రాబర్ట్ వాద్రా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.రాజకీయాల్లో ప్రియాంకకు ఉజ్వల భవిష్యత్ ఉందని, ఈ దేశంలో క్షేత్రస్థాయిలో అవసరమైన మార్పులు తీసుకురాగలదని తాను భావిస్తున్నట్లు రాబర్ట్ వాద్రా పేర్కొన్నారు. ప్రియాంక తన బామ్మ ఇందిరాగాంధీ, తండ్రి రాజీవ్ గాంధీ, సోనియా, సోదరుడు రాహుల్ గాంధీ నుంచి చాలా నేర్చుకుందని తాను భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలలో ఆమె గుర్తింపు పొందారు. ఆమె ఏం మాట్లాడినా గుండె లోతులనుంచి సూటిగా మాట్లాడుతుంది. ప్రజలు ఆమె మాటలను ఇష్టపడుతున్నారని వాద్రా అన్నారు.