మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలను తెలుసుకోవడానికి ప్రజలకు హక్కు ఉందని హైకోర్టు న్యాయమూర్తి సూరేపల్లి నందా వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ప్రభుత్వ జీఓలు నాలుగు వారాల్లోపు అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓలు వెబ్‌సైట్ ఉంచడం లేదంటూ బిఆర్‌ఎస్ నాయకుడు ఎర్రోళ్ల శ్రీనివాస్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను మంగళవారం విచారించిన న్యాయమూర్తి సూరేపల్లి నందా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ నిర్ణయాలు తెలుసుకోవడానికి ప్రజలకు హక్కు ఉందన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు, నియమాలు, నోటిఫికేషన్‌లను తక్షణమే అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఇవి తదుపరి ఆదేశాలకు అనుగుణంగా
ఉంటాయని ధర్మాసనం స్పష్టం చేసింది. విచారణ సందర్భంగా ప్రభుత్వ ఉత్తర్వులు, ఇతర నోటిఫికేషన్‌లను పబ్లిక్ డొమైన్‌లో అప్‌లోడ్ చేయడంలో రాష్ట్రం ప్రభుత్వం అనుసరించిన తీరు చట్టవిరుద్ధమని, ఏకపక్షమని పిటిషనర్ తరపు న్యాయవాది రామవరం చంద్రశేఖర్ కోర్టుకు తెలిపారు. సమాచార సాంకేతిక చట్టం 2005 సూత్రాలను ఇది ఉల్లంఘిస్తుందని న్యాయవాది వాదించారు. రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 7వ తేదీ 2023 నుండి జనవరి 26వ తేదీ 2025 వరకు 19,064 జీఓలు జారీ చేసిందని, వాటిలో 3,290 జీఓలు మాత్రమే ప్రజలు అందుబాటులో ఉన్నాయని 15,774 జీఓలు కనిపించడంలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. జారీ చేసిన జీఓలు, ప్రజలకు అందుబాటులో ఉంచిన జీఓల మధ్య గణనీయమయిన వ్యత్యాసం ఉందని పిటిషనర్ కోర్టుకు వివరించారు. ఏప్రిల్ 10, 2017లో జీఓ ఎంఎస్ నెంబర్ 4ను అనుసరించి ప్రభుత్వ విధానాలు అన్ని విభాగాల డేటాతో వెబ్‌సైట్ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిందని కోర్టుకు వివరించారు.
హైకోర్టు ఆదేశం
ప్రభుత్వానికిచెంపెట్టు : హరీశ్ రావు
రాష్ట్ర ప్రభుత్వం దాచి పెట్టిన అన్ని జీవోలను నాలుగు వారాల లోపు బహిర్గతం చేయాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు సోకాల్డ్ ప్రజా ప్రభుత్వానికి చెంపపెట్టు అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమద్యం ఎక్స్‌వేదికగా స్పందించారు. ప్రజా ప్రభుత్వం అని చెప్పుకోవడం కాదు రేవంత్ రెడ్డి, చీకటి జీఓల మాటున దొంగచాటుగా ఏం చేస్తున్నావో బహిర్గతం చెయ్యాలన్నారు. ప్రజాపాలన అని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ జీఓలు దాచుతూ చేస్తున్న డ్రామా బిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్ హైకోర్టులో దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంతో బట్టబయలు కాబోతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 13 నెలల్లో 19,064 జీఓలు జారీ చేయగా, వాటిలో కేవలం 3,290 జీఓలు మాత్రమే పబ్లిక్ డొమైన్‌లో ఉంచడంలో అంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఒక్క ఏడాదిలో 15,774 జీఓలు అంటే 82 శాతం జీఓలను దాచి పెట్టి ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు? అని, ఇదేనా మీరు చెప్పిన ప్రజా ప్రభుత్వం? అంటూ సిఎం రేవంత్ రెడ్డిని నిలదీశారు.