నాణ్యతలోపం వల్లే మంథని మండలం అడవిసోమన్‌పల్లి చెక్‌డ్యాం కూలిపోయిందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా మంథని మండలం అడవిసోమన్‌పల్లి గ్రామంలోని చెక్‌డ్యాంను మంత్రి శ్రీధర్‌బాబు అధికారులతో కలిసి క్షుణ్నంగా పరిశీలించారు. అనంతరం పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అడవిసోమన్‌పల్లి చెక్‌డ్యాం గత ప్రభుత్వంలో నిర్మించిందని మంత్రి శ్రీధర్‌బాబు గుర్తు చేశారు. చెక్‌డ్యాం నాణ్యత లేకుండా కూలిపోయిందని చెక్‌డ్యాంను చూస్తుంటే అర్థమవుతుందన్నారు. అడవిసోమన్‌పల్లి చెక్‌డ్యాం కూలిపోయిన సంఘటనలో ప్రత్యక్ష సాక్షులు ఉన్నారని, సమగ్ర విచారణలో గ్రామస్తుల, ప్రత్యక్ష సాక్ష్యుల సమక్షంలో నిజనిర్దారణ చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. నాణ్యత లేకుండా కట్టడంవల్లే చెక్‌డ్యాం కూలిపోయి ఉంటుందని, గత ప్రభుత్వం కమిషన్‌లకు ఆశపడి చెక్‌డ్యాం నాణ్యతను గాలికి వదిలేసిందని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వం నిర్మించిన నాణ్యతలేని కాళేశ్వరం ప్రాజెక్టు, మంథని నియోజకవర్గంలోని చెక్‌డ్యాంల వల్ల ఎన్ని పొలాలు బాగుపడ్డాయో, ఎవరు లాభ పడ్డారో ప్రజలు గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఎవరికోసం చెక్‌డ్యాంలు నిర్మించారో, ఎవరి లాభం కోసం, ఎవరి కమిషన్ల కోసం నాణ్యత లేకుండా నిర్మాణం చేపట్టారో సమగ్ర విచారణ చేపట్టిన తర్వాత వివరిస్తామని ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తిలేదన్నారు.