దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు వరుసగా రెండో రోజు ఆల్‌టైమ్ గరిష్టానికి చేరాయి. ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ ప్రకారం, దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర రూ.2,650 పెరిగి రూ.1,40,850 లకు చేరుకుంది. సోమవారం ఇది రూ.1,38,200 వద్ద ఉంది. 2024 డిసెంబర్ 31న 10 గ్రాముల పసిడి ధర రూ.78,950 వద్ద ఉంది. అంటే ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు బంగారం ధర రూ.61,900 (78.40 శాతం) పెరిగింది. మరోవైపు వెండి కూడా బంగారం కంటే వేగంగా పెరుగుతోంది. మంగళవారం నాడు కిలో వెండి ధర రూ.4000 జంప్ చేసి రూ.2,23,000 చేరుకుంది. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ ప్రకారం, పది రోజుల్లో వెండి ధర మొత్తం రూ.23,762 పెరిగింది. ఈ ఏడాది సిల్వర్ రేటు రూ.1.23 లక్షలకు పైగా పెరగడం గమనార్హం. భౌగోళిక ఉద్రిక్తతలు, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, అమెరికా డాలర్ బలహీనత వంటి విషయాలు బంగారం ధర పెరుగుదలకు కారణవుతున్నాయి. కేడియా అడ్వైజరీ డైరెక్టర్ అజయ్ కేడియా మాట్లాడుతూ, డిమాండ్ బలంగా ఉండటంతో వచ్చే ఏడాది బంగారం రూ.1.50 లక్షలు, వెండి రూ.2.50 లక్షలు చేరవచ్చని తెలిపారు.