వ్యవసాయశాఖ ప్రవేశపెట్టిన యూరియా యాప్ ఐదు జిల్లాలలో ప్రయోగాత్మకంగా అమలు అయ్యిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. రైతులకు పారదర్శకంగా, అవసరాలకు అనుగుణంగా యూరియా అందించేందుకు ప్రవేశ పెట్టిన యూరియా యాప్ ఐదు జిల్లాల్లో సుమారు లక్ష మందికి పైగా డౌన్ లోడ్ చేసుకున్నట్లు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో 897, జనగామలో 5,150, మహబూబ్ నగర్ 3,741, నల్లగొండ 3,618, పెద్దపల్లి జిల్లాలోని 6,289 డౌన్ లోడ్ చేసున్నారన్నారు. మొత్తం 19,695 మంది రైతులు ఈ యాప్ ద్వారా తమ సమీప డీలర్ దగ్గర 60,510 యూరియా బస్తాలు బుక్ చేసుకున్నట్లు పేర్కొన్నారు. దీంతో పాటు 217 మంది కౌలు రైతులు కూడా
678 యూరియా బస్తాలు ఈ యాప్ ద్వారా బుక్ చేసుకున్నారని మంత్రి చెప్పారు. మొదటి రోజు అక్కడక్కడ తలెత్తిన సాంకేతిక సమస్యలను కూడా వెంటనే పరిష్కరించామని మంత్రి వివరించారు. రైతులు ఈ యాప్ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారని, ఈ యాప్‌తో ఏ ఊరిలో ఏ డీలర్ దగ్గర ఎంత స్టాక్ ఉందో తెలుస్తుందని, తద్వారా రైతులు బుక్ చేసుకొని, వారికి నచ్చిన సమయంలో షాప్ వద్దకు వెళ్లి ఒటిపి చూపించి కొనుగోలు చేసారని మంత్రి తెలిపారు. ఈ రెండు రోజుల్లో యాప్ విజయవంతం కావడంతో, ఈ యాప్ ను మరికొన్ని రోజులు పరిశీలించి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయడానికి సిద్ధం కావాలని అధికారులను మంత్రి తుమ్మల ఆదేశించారు. కాగా, రైతునేస్తం కార్యక్రమంలో కూడా రైతులకు యాప్ పై సందేహాలను నివృత్తి చేశామని మంత్రి స్పష్టం చేశారు.