బెంగళూరు: టీం ఇండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ త్వరలో డొమెస్టిక్ క్రికెట్‌లో తిరిగి అడుగు పెట్టనున్నాడు. దాదాపు 15 సంత్సరాల తర్వాత విజయ్ హజారే ట్రోఫీలో కోహ్లీ పాల్గొననున్నాడు. చివరిసారి ఫిబ్రవరి 18, 2010లో ఈ టోర్నమెంట్‌లో కోహ్లీ ఆడాడు. మళ్లీ ఇన్నాళ్లకు దేశవాళీ టోర్నమెంట్‌లో కోహ్లీ బరిలోకి దిగుతుండటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. సోమవారం రాత్రి విరాట్ బెంగళూరుకు చేరుకున్నాడు.
చిన్నస్వామి స్టేడియంలో జరిగే విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్ అన్ని ఫ్యాన్స్ లేకుండానే నిర్వహించాలని కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌కి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రెండు స్టాండ్‌లు మాత్రమే తెలిచి 2 లేదా 3 వేల మంది అభిమానులను లోపలికి అనుమతించాలని కెఎస్‌సిఎ కోరగా.. ఆ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. క్రిస్మస్ సెలవుల నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా అనుమతి నిరాకరించారు. గ్రేటర్ బెంగళఊరు అథారిటీ కమిషనర్ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. బెంగళూరు పోలీస్ కమీషనర్, అగ్నిమాపక, అత్యవసర శాఖలు, ఆరోగ్యశాఖతో కూడిన ఈ కమిటీ త్వరలో చిన్నస్వామి స్టేడియాన్ని పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందజేయనుంది. దాని ఆధారంగా ప్రేక్షకుల అనుమతిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.