లక్నో: ప్రియుడితో కలిసి భర్తను చంపి గ్రైండర్‌లో ముక్కలుగా చేసి శరీర భాగాలను మురిక కాలువలో పడేసింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం సంభాల్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… చందౌసిలోని మొహల్లా చున్నీలో రాహుల్, రుబీ అనే దంపతులు నివసిస్తున్నారు. గౌరవ్ అనే వ్యక్తితో రుబీ వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్తకు తెలియడంతో పలుమార్లు భార్యను మందలించాడు. అక్రమ సంబంధం విషయంలో దంపతుల మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉండడంతో తొలగించుకోవాలని నిర్ణయం తీసుకుంది. నవంబర్ 18న భర్తను తన ప్రియుడితో కలిసి ఇనుప రాడ్‌తో కొట్టి చంపారు. అనంతరం మృతదేహాన్ని గ్రైండర్‌లో వైసి ముక్కలు ముక్కలు చేశారు. ఈడ్గాలోని మురికి కాలువలో శరీర భాగాలను పడేశారు. మరికొన్ని శరీర భాగాలు రాజ్‌ఘాట్‌లోని గంగా నదిలో పడేశారు. తన భర్త కనిపించడంలేదని అదే రోజు స్థానిక పోలీస్ స్టేషన్‌లో భార్య ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈడ్గాలోని మురికి కాలువలో డిసెంబర్ 15న శరీర భాగాలు కనిపించడంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక శరీర భాగంపై రాహుల్ పేరు ఉండడంతో పోలీసులు లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. రాహుల్ భార్య రూబీని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. కుళ్లిపోయిన శరీర భాగాలకు డిఎన్‌ఎ పరీక్షలు చేయించారు. రాహుల్‌దే మృతదేహం అని గుర్తించారు. రూబీని అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించడంతో నిజాలు బయటకు వచ్చాయి. తన ప్రియుడు గౌరవ్‌తో కలిసి హత్య చేశానని ఒప్పుకుంది. వెంటనే ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.