టెస్ట్, వన్డేలకు కెప్టెన్‌గా ఉన్న శుభ్‌మాన్ గిల్.. టి-20 ఫార్మాట్‌లో మాత్రం రాణించలేకపోతున్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన టి-20 సిరీస్‌లో అతను ఆశించిన స్థాయిలో బ్యాటింగ్ చేయలేకపోయాడు. ఈ కారణంగానో.. లేక ఇతర కారణాల వల్లనో టి-20 ప్రపంచకప్ – 2026 కోసం ప్రకటించిన జట్టులో గిల్‌ను పక్కన పెట్టారు సెలక్టర్లు. అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతకాలంగా నిరాశపరుస్తున్న కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ని కొనసాగించి.. గిల్‌పై వేటు వేయడాన్ని కొందరు తప్పుబట్టారు. తాజాగా ఈ విషయంపై టీం ఇండియా మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ స్పందించారు. గిల్, సూర్యల మధ్య చాలా తేడాలు ఉన్నాయని ఆయన అన్నారు.
‘‘టి-20ల్లో సూర్య మ్యాచ్ విన్నర్‌గా నిరూపించుకున్నాడు. ఐసిసి ర్యాంకింగ్స్‌లో అతడు టాప్-10లో ఉన్నాడు. ఎన్నో మ్యాచుల్లో భారత్‌ను ఒంటి చేత్తో గెలిపించాడు. కాబట్టి సూర్యను గిల్‌తో పోల్చలేము. గిల్ అంతర్జాతీయ టి-20ల్లో తనను తాను ఇంకా నిరూపించుకోవాలి. ఉదాహరణకు కోహ్లీ విషయమే చూస్తే.. కొవిడ్ సమయంలో ఆ రెండేళ్ల పాటు పెద్దగా పరుగులు చేయలేదు. కానీ, అంతకు ముందు అతడికి గొప్ప రికార్డు ఉంది. 10 సంవత్సరాల పాటు మ్యాచ్ విన్నర్‌గా ఉన్నాడు. ఈ క్రమంలో కోహ్లీకి మద్ధతుగా నిలవగా.. పేలవ ఫామ్ నుంచి బయటపడి మళ్లీ తిరిగి భారీ స్కోర్లు చేయడం ప్రారంభించాడు. సూర్య కూడా ప్రస్తుతం ఇదే కేటగిరీలో ఉన్నాడు. టి-20 ఫార్మాట్‌లో సూర్యకు గిల్ ఎక్కడా చేరువలో లేడు. ఫామ్‌లో లేని ఇద్దరిని జట్టు నుంచి తొలగించాలని అనడం సరికాదు’’ అని కైఫ్ పేర్కొన్నారు.