కాళేశ్వరం పేరుతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు
ఆంధ్రావాళ్లకు అమ్ముడుపోయిందే బిఆర్‌ఎస్ పార్టీ
పాలమూరుకు ఇప్పటికీ పూర్తి పర్యావరణ అనుమతులు రాలేదు: మంత్రి ఉత్తమ్ ధ్వజం
ప్రజా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కెసిఆర్‌కు కనబడటం లేదా?
మీది హైప్.. మాది హోప్ క్రియేట్ చేసే వర్కింగ్ కల్చర్
మీలాగా గాలిలో మేడలు కట్టడం మాకు రాదు
కెసిఆర్ వ్యాఖ్యలపై విరుచుకుపడ్డ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
మాది మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం
రైతుల సౌకర్యం కోసమే యూరియా సరఫరా యాప్
రైతుల గురించి మాట్లాడే అర్హత బిఆర్‌ఎస్‌కు లేదు
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర విమర్శలు
బిఆర్‌ఎస్సే దద్దమ్మ ప్రభుత్వం: మంత్రి జూపల్లి
మన తెలంగాణ/హైదరాబాద్ : కేసీఆర్, హరీష్‌రావు బరితెగించి మాట్లాడుతున్నారని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. హరీష్‌రావు అతి తెలివితేటలు వాడటం ప్రజలు గమనిస్తున్నారన్నారని, హరీశ్‌రావు గోబె ల్స్ అని పెట్టుకోవాలన్నారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. సిగ్గులేకుండా కేసీఆర్, హరీశ్‌రావు వ్యాఖ్య లు ఉన్నాయని ధ్వజమెత్తారు. ఆంధ్ర వాళ్లకు అమ్ముడు పోయిందే బీఆర్‌ఎస్ పార్టీ అని మండిపడ్డారు. సోమవారం సచివాలయంలో మీడియా ప్రతినిధులతో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చిట్ చాట్ నిర్వహించారు. కేసీఆర్ డిజైన్ చేసి నిర్మించిన కాళేశ్వరం వారి హయాంలోనే కూలిందని, మేడిగడ్డ గురించి మాట్లాడటం ఆపి సిగ్గుతో తలదించుకోవాలన్నా రు. తెలంగాణ ప్రజల తలలను తాకట్టు పెట్టి కేసీఆర్ కట్టిన కాళేశ్వరం కూలిపోయిందని రాష్ట్రంలో ఇప్పుడు నడుస్తున్న ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో నిర్మించినవేనన్నారు.
కాళేశ్వరం నుంచి ఐదేళ్లలో 70 టీఎంసీ మా త్రమే నీళ్లను ఉపయోగించారన్నారు. కాళేశ్వరంలో మూడు బ్యారేజ్‌లు కూలిపోతే సిగ్గుతో తల దించుకోవాల్సింది పో యి ఎదురు దాడి చేస్తున్నారని విమర్శించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలోని పాలమూరు, కల్వకుర్తి, నెట్టెంపాడు, డిండి, ఎస్‌ఎల్‌బిసి ప్రాజెక్టులను కేసీఆర్ ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. కేసీఆర్ అప్పులు తీర్చడానికి ఏడాదికి 16 నుంచి 20వేల కోట్లు రూపాయలు కడుతున్నామని చెప్పారు. గతంలో వాళ్ళు చేసిన 45 టీఎంసీ మైనర్ ఇరిగేషన్, గోదావరి డైవర్షన్ సేవింగ్ 45 టీఎంసీలు నిర్ణయం ప్రకారమే లేఖ రాశామని, లేఖ కొత్తది కాదన్నారు. పాలమూరుకు ఇప్పటికీ పూర్తిగా పర్యావరణం అనుమతులు రాలేదని, పదేళ్ళ పాటు పాలమూరు పూర్తి చేయకుండా అక్కడి ప్రజలను కేసీఆర్ మోసం చేశారన్నా రు. 90 శాతం పనులు పూర్తయితే ఒక్క ఎకరాకు నీళ్లు ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు.
కేసీఆర్, హరీశ్‌రావు తీస్మార్ ఖాన్లు
కేసీఆర్ మాట్లాడితే కాంట్రాక్టర్లు అంటున్నారని, మొత్తం లెక్కలు తీస్తే అసలు విషయం తెలుస్తుందని ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. కేసీఆర్, హరీశ్‌రావు ద్రోహం, కుట్రతో ఏపీకి నీళ్లు అప్పగించారని ఆరోపించారు. కేసీఆర్, హరీష్‌రావు తీస్మార్ ఖాన్లు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌లో ఏపీతో కు మ్మకై రోజుకు 3 టీఎంసీలు అప్పగించారని, అబద్ధాలు మా ట్లాడటానికి హరీష్‌రావుకు నోరు ఎలా వస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పనులు ఆపించామన్నారు. తాను అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పాలని నిలదీశారు. నల్గొండ జిల్లాకు అన్యాయం చేసేందుకు కేసీఆర్ డిండికి అనుమతి ఇవ్వలేదని కోమటిరెడ్డి పై కోపంతో బ్రహ్మనవెల్లి ప్రాజెక్టుపై కుట్ర చేశారని ఆరోపించారు.
మాది చేతల ప్రభుత్వం:తుమ్మల
కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల కాలంలో తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలతో రైతు ప్రభుత్వం అనే పేరు తెచ్చుకుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతుల పట్ల బిఆర్‌ఎస్ అధినేత, మాజీ సిఎం కెసిఆర్ చేసిన వ్యాఖ్యలను సోమవారం మంత్రి ఓ ప్రకటనలో ఖండించారు. రైతు ల సమయాన్ని ఆదా చేసేందుకు రాష్ట్ర ప్రభు త్వం యూరియా సరఫరాలో యాప్ తీసుకొస్తుందని స్పష్టం చేశారు. పదేళ్ళు అధికారంలో ఉన్నామని చెప్పుకొనే వారికి యూరియా ఎవరిస్తారు? ఎక్కడి నుండి వస్తుంది, ఎలా వస్తుంది అని తెలియక మాట్లాడుతున్నారో లేక ఎప్పటిలాగే స్వార్ధరాజకీయాల కోసం మాట్లాడుతున్నారో ప్రజలు గమనించాలని కోరారు.
ప్రభుత్వం వద్ద సరిప డా యూరియా నిల్వలు ఉన్నా, ప్రతిపక్ష పార్టీ నాయకులు రైతులను మరింత భయపెట్టే విధం గా మాట్లాడి, రైతులు యూరియా కోసం ఒకేసారి కొనుగోళ్ల కోసం వచ్చే విధంగా చేశారని మంత్రి ఆరోపించారు. కొందరు యూరియాను పక్కదారి పట్టించినట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని, ఈ మో సాన్ని ప్రభుత్వం మీద నెట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. ఈ విషయాన్ని గ్రహించిన గ్రామీణ ప్రజలు మరొక్కసారి బిఆర్‌ఎస్‌ను తిరస్కరించారన్నా రు. యూరియా పక్కదారి పట్టకుండా, రైతులు క్యూ లైన్లలో సమయాన్ని వృధా చేసుకొకుండా, పారదర్శకంగా అమ్మకాలు జరగాలనే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం యాప్‌ని తీసుకొస్తుందని మంత్రి స్పష్టం చేశారు.
మీలా గాల్లో మేడలు కట్టం: మంత్రి శ్రీధర్‌బాబు
తెలంగాణలో కాంగ్రెస్‌పార్టీ రెండేళ్లపాటు చేసిన అభివృద్ధి కేసీఆర్‌కు కనబడకపోవడం విడ్డూరంగా ఉందని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధికి దోహదపడేలా కేసీఆర్ నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలని సూచించారు. జరుగుతున్న అభివృద్ధిని కేసీఆర్ ఎందుకు చూడలేకపోతున్నారో అర్థం కావడం లేదని వ్యా ఖ్యానించారు. కేసీఆర్ గారూ… మీ హయాంలో చేసింది తక్కువ, చెప్పుకుంది ఎక్కువ అని అన్నారు. తమ హయాంలో చేసేదే ఎక్కువ.. చెప్పుకునేది తక్కువ అని, మీలాగా మాకు ‘గాల్లో మేడలు’ కట్టడం రాదని ఎద్దేవా చేశారు.
‘గేట్ పాస్’ కల్చర్‌కు ఫుల్ స్టాప్ పెట్టాం
మీ హయాంలో ఏ కంపెనీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలన్నా మీ ‘కుటుం బం’ అనుమతి తప్పనిసరి. అవునా..కాదా..? మేము ఆ ‘గేట్ పాస్’ కల్చర్‌కు ఫుల్ స్టాప్ పెట్టాం. అందుకే నేడు ప్రపంచ స్థాయి పెట్టుబడులకు తెలంగాణ బై ఛాయిస్ కాదని, బై డెస్టినేషన్‌గా మారిందని, అందుకే పరిశ్రమలు తెలంగాణకు క్యూ కడుతున్నాయని స్పష్టం చేశారు. ఎక్కడో ఉండి పాలన సాగించిన మీకు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూలు చేసుకోవడం ‘హైప్’ లాగే కనిపిస్తుంది. ఇది హైప్ కాదు..ఈ రాష్ట్రం కోసం, భా వితరాల భవిష్యత్తు కోసం తమ ప్రభుత్వం క్రియేట్ చేస్తున్న ‘హోప్’ అని వెల్లడించారు. కేసీఆర్ హయాంలో కూడా అనేక ఒప్పందాలు జరిగాయని గుర్తు చేస్తూ రాష్ట్రానికి పెట్టుబడులు రావడం అనేది ఎప్పటికీ కొనసాగే నిరంతర ప్రక్రియ అని తెలిపారు.
తప్పుడు ప్రచారం తగదు
దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలిచేలా ‘భారత్ ఫ్యూచర్ సిటీ’కి శ్రీకారం చుట్టామని, కానీ మీరు మాత్రం ‘రియల్ ఎస్టేట్’ కోసమే అంటూ తప్పుడు ప్రచారం చేయడం తగదని శ్రీధర్‌బాబు అన్నారు. రాష్ట్రంలో పెట్టబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే వారికి అవసరాలకు అనుగుణంగా అన్ని ఒకే చోట ఉండాలనే గొప్ప సంకల్పంతో ఫ్యూచర్ సిటీ ప్రణాళికలు రూపొందించామన్నారు. ‘వరంగల్ టెక్స్ టైల్ పార్క్’ మీద పేటెంట్ మీదా…? మరి మీ హయాంలో ఎందుకు పూర్తి చేయలేదు…? అని శ్రీధర్‌బాబు ప్రశ్నించారు. ఒక ప్రణాళికా ప్రకారం మేం అసంపూర్తిగా మిగిలిపోయిన పార్క్‌ను పూర్తి చేశామని, అక్కడికి దిగ్గజ కంపెనీలను తీసుకువచ్చామని, దేశంలో ఇదే మొట్ట మొదటి ఫంక్షనల్ పీఎం మిత్ర పార్క్ అని, కేంద్రం నుంచి తమ హయాంలోనే రూ.30 కోట్లు ఈ పార్కు అభివృద్ధికి తీసుకు వచ్చామన్నారు.