మన తెలంగాణ/హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చేపట్టిన డివిజన్ల విభజన ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. దీనికి సంబంధించి దాఖలయిన 80 పిటిషన్లు సోమవారం హైకోర్టు కొట్టేసింది. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న 20 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లను ప్రభుత్వం జిహెచ్‌ఎంసిలో విలీనం చేసిన విషయం తెలిసిందే. దీనికి అనుగుణంగా జిహెచ్‌ఎంసిలో డివిజన్ల సంఖ్యను 150 నుంచి 300కి పెంచింది. ఈ క్రమంలో డివిజన్ల విభజన సరిగ్గా జరగలేదంటూ నారగూడెం మల్లారెడ్డి, సోల్కర్ రెడ్డి, మల్లేష్ యాదవ్, విజయ్ కుమార్, దేవర శ్రీనివాస్, మధుకర్ రెడ్డి, గొరిగే. రాజు, వెంకటేష్ అనే వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ల తరపున న్యాయవాదులు ఆంటోని రెడ్డి, అవినీష్‌రావులు వాదనలు వినిపించారు. విభజనలో అనేక అవకతవకలు, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమయిన నిర్ణయాలు చోటు చేసుకున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుత డివిజన్ విభజన ప్రజల అభిప్రాయాలు, స్థానిక వాస్తవాలు, భౌగోళిక పరిస్థితులు, జనాభా ప్రమాణాలను పరిగణనలోకి తీసుకోకుండా చేపట్టిందని పిటిషన్‌లో వివరించారు.
ఈ విభజన వల్ల ప్రజలకు పరిపాలనా ఇబ్బందులు, అభివృద్ధి అసమానతలు, ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్యంలో గందరగోళం ఏర్పడే అవకాశం ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పాటు సంబంధిత నిబంధనలు, చట్టపరమైన విధానాలను పూర్తిగా పాటించకుండా డివిజన్ విభజన చేపట్టడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ అంశంపై తక్షణమే స్టే విధించాలని, ప్రజల ప్రయోజనాలను కాపాడే విధంగా సరైన మార్గదర్శకాలు జారీ చేయాలని హైకోర్టును కోరారు. ఎంసిహెచ్‌ఆర్‌డిలో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సమర్పించిన నివేదిక ఆధారంగా వార్డుల పునర్విభజన చేశామని ప్రభుత్వం చెబుతున్నా ఆ నివేదికను ఇంతవరకు బయటపెట్టలేదని, అభ్యంతరాల స్వీకరణకు తగినంత గడువు ఇవ్వలేదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు.
కాగా, చట్టపరిధిలోనే వార్డు విభజన నోటిఫికేషన్‌ను జారీ చేసినట్లు ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పటికే వెబ్‌సైట్‌లో ఉంచామని, ఇప్పటివరకు అందిన 3,100 అభ్యంతరాలు పరిష్కరిస్తున్నట్లు కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఇప్పటికే ప్రక్రియ ముగిసినందున ఈ అంశంల కల్పించుకోలేమంటూ దాఖలయిన 80 పిటిషన్లు కొట్టివేసింది.