మరో విద్యార్థి నాయకుడిపై కాల్పులు
చెలరేగుతున్న ఆందోళనలు, హింసాకాండ
న్యూఢిల్లీ: అల్లర్లు హింసాకాండ, ఆందోళనలతో బంగ్లాదేశ్ భగ్గున మండిపోతోంది. రెండు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఇంకిలాబ్ మంచ్ నేత ఉస్మాన్ హాది హత్యపై హింసాకాండ చెలరేగిన నేపథ్యంలో మరో విద్యార్థి నాయకుడిపై కాల్పులు జరాగాయి. ఖుల్నా జిల్లాలో విద్యార్థుల నాయకత్వంలోని నేషనల్ సిటిజన్ పార్టీ (ఎన్సీపీ) సీనియర్ నాయకుడు మహమ్మద్ సిక్దర్ తలపై కాల్పులు జరిపారు. నగరంలోని సోనదంగ ప్రాం తంలో సోమవారం ఉదయం 11.45 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సిక్దార్ ఎన్సీపీ కార్మిక విభాగం, జాతీయ శ్రామిక్ శక్తికి చెందిన ఖుల్నా డివిజన్ కన్వీనర్ ఖుల్నాలో త్వరలో పార్టీ తరుపున డివిజన్ కార్మిక ర్యాలీ నిర్వహించే ఏర్పాట్లలో ఉండగా అతడిపై దాడి జరిగింది. సిక్దర్ తల ఎడమవైపున తుపాకీ గాయం కావడంతో ఆస్పత్రిలో చేర్చారు.
గతవారం తీవ్రవాద నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాది మరణం తర్వాత దేశవ్యాప్తంగా హింసాత్మక నిరసనలు చెలరేగాయి. 32 ఏళ్ల హాది 2024లో బంగ్లాదేశ్ లో జరిగిన విద్యార్థి తిరుగుబాటులో కీలక పాత్రవహించాడు. ఈ ఆందోళన అప్పటి ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వాన్ని కుప్పకూల్చింది. బంగ్లాదేశ్ లో 2026 ఫిబ్రవరిలో సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఆ ఎన్నికల ప్రచారానికి హాది బయలుదేరుతుండగా డిసెంబర్ 12న ముసుగు ధరించిన దుండగులు జరిపిన కాల్పులలో తీవ్రంగా గాయపడి, ఢాకాలో ప్రాథమిక చికిత్సతర్వాత మెరుగైన వైద్యం కోసం సింగపూర్ తరలించగా డిసెంబర్ 18న హాది మరణించిన సంగతి తెలిసిందే.