మరో 13 మందికి గాయాలు
మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఘటన
మన తెలంగాణ/జైపూర్ : పొట్ట కూటి కోసం కూలీ పని చేయడానికి వెళ్తూ మార్గమధ్యంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు నిద్రలోనే మృత్యువు ఒడిలోకి చేరారు. ఈ విషాధ సంఘటన మంచిర్యాల జిల్లా, జైపూర్ మండలం, జైపూర్ పోలీస్‌స్టేషన్ పరిధి ఇందారం జిఎం ఆఫీసు సమీపంలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందగా 13 మంది గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే..మహారాష్ట్రలోని చంద్రాపూర్‌కు చెందిన చాందిని బుజ్ గ్రామానికి చెందిన 23 మంది కూలీలు బొలేరో వాహనంలో పెద్దపల్లి జిల్లా, సుల్తానాబాద్ పరిసర గ్రామాల్లో వరి నాట్ల కోసం బయల్దేరారు.
సోమవారం తెల్లవారుజామున ఇందారం క్రాస్ రోడ్డు సమీపంలో డ్రైవర్ మూత్రవిసర్జన కోసం వాహనాన్ని ఎడమ వైపునకు మెల్లగా రోడ్డు దించుతున్నాడు. ఆ సమయంలో శ్రీరాంపూర్ నుండి వచ్చిన లారీ అతి వేగంగా బొలేరో వాహనాన్ని వెనుక వైపు నుంచి ఢీకొనడంతో సమీపంలో ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక మహిళా కూలీ అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతి చెందిన వారిలో మీనాబాటిల్‌వాల్ (45), నీలాభాయ్ (60), ఇమిలిబాయ్ (48) ఉన్నారు. ప్రమాదం సమాచారం అందుకున్న జైపూర్ పోలీసులు 108 వాహనం ద్వారా 13 మంది క్షతగాత్రులను మంచిర్యాల ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సంఘటన జరిగిన ప్రదేశంలో రోడ్డు పనులు జరగడంతో పాటు రోడ్డు పూర్తిగా కోసుకుపోయి ఉంది. కాగా, సంఘటన స్థలాన్ని సందర్శించిన సిఐ నవీన్ కుమార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారితో మాట్లాడి ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ శ్రీరాంపూర్ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడని తెలిపారు.