అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాలుగా కో లివింగ్ హాస్టల్స్
తెలిసినా చర్యలు తీసుకోని అధికారులు
మన తెలంగాణ/గచ్చిబౌలి: అసాంఘిక కార్యక్రమాలకు కో లివింగ్ హాస్టల్స్ అడ్డాలుగా మా రాయి. తాజాగా మరో సంఘటన బయటకువచ్చింది. రాయదుర్గం పోలీస్‌స్టేషన్ పరిధిలోని అంజయ్య నగర్ గార్నెట్ పీజీ కో లివింగ్ హాస్టల్లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాయదుర్గం పోలీసులు, రాజేంద్రనగర్ ఎస్‌ఓటి పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడిలో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. సిఐ వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం రాయదుర్గం పోలిస్ స్టేషన్ పరిధిలోని అంజయ్య నగర్ కో లివింగ్ గార్నెట్ పీజీ హస్టల్లో డ్రగ్స్ విక్రయిస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో పోలీసులు దాడి చేశారు.
దాడిలో కంబం వంశీ దిలీప్ (29), మదగాని బాల ప్రకాష్ బాలు (29), మణికంఠ మనితేజ (30), రోహిత్ గౌడ్ (26), మదగాని తరుణ్ (33)లను అదుపులోకి తీసుకున్నారు. బెంగుళూర్ నుండి తక్కువ ధరకు డ్రగ్స్ తీసుకువచ్చి హైదరాబాద్‌లో గ్రాము రూ.6 వేలకు అమ్ముతున్నారు. ఎండిఎంఏ సప్లైయర్ విజయవాడకు చెందిన అలీంతోపాటు వ్యక్తి నిందితుడు కార్తిక్, ఒక నైజిరియన్ పరారీలో ఉన్నారు. నిందితుల నుండి 12 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్, 8 గ్రాముల ఎజి కుష్, 6 మొబైల్ ఫోన్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకొని ఎన్‌డిపిఎస్ యాక్ట్‌పై కేసు నమోదు చేశారు.