మన తెలంగాణ/హైదరాబాద్‌ః ఉపాధి హామీ పథకం చట్టానికి బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఉరి వేసిందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సీతక్క మండిపడ్డారు. ఈ పథకాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఉపాధి హామీ పథకాన్ని కాపాడాలని గ్రామాల్లో తీర్మానాలు చేసి కేంద్రానికి పంపిస్తామని ఆమె సోమవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈ నెల 27, 28 తేదీల్లో ర్యాలీలు నిర్వహిస్తామని ఆమె చెప్పారు.
గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగించి బిజెపి మరోసారి గాంధీని హత్య చేసిందని ఆమె దుయ్యబట్టారు. ఉపాధి హామీ పథకంలో కేంద్రం ప్రతి ఏడాది పని దినాలను తగ్గిస్తూ వచ్చిందని, సొంత గ్రామాల్లో పని హక్కు లేకుండా చేస్తున్నదని ఆమె విమర్శించారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తే గ్రామాల్లో కూలీలకు పని ఉండదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం బిక్షగా కాకుండా ఉపాధి హక్కుగా లభించే విధంగా ఉన్న ఉపాధి హామీ చట్టాన్ని అందరూ కాపాడుకోవాల్సిన అవశ్యకత ఉందన్నారు. కేంద్రం తెచ్చిన కొత్త చట్టానికి తాము వ్యతిరేకమని ఆమె తెలిపారు. బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌ను ఎలా ఫుట్‌బాల్ ఆడుకోవాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలుసునని ఆమె అన్నారు. కొత్తగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు.