మన తెలంగాణ / హైదరాబాద్ : సామాజిక కార్యకర్త, అనాధాశ్రమాన్ని నిర్వహిస్తున్న గాదె ఇన్నయ్యను ఎన్‌ఐఎ అధికారులు అప్రజాస్వామికంగా అరెస్టు చేశారని సిపిఎం తెలంగాణ కమిటీ ఆరోపించింది. ఆయన అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ తెలిపారు. మావోయిస్టు నేత కాతా రామచంద్రారెడ్డి అంత్యక్రియలో పాల్గొని అక్కడ జరిగిన సభలో మావోయిస్టులకు అనుకూలంగా మాట్లాడారనే నెపంతో ఈ అరెస్టు జరిగినట్లు పోలీసులు చెబుతున్నానని ఆయన అన్నారు.
ఆపరేషన్ కగార్, కేంద్ర ప్రభుత్వ నిరంకుశ ధోరణులను వ్యతిరేకిస్తున్నవారిని, సామాజిక సమస్యలపై స్పందించే వ్యక్తులను అరెస్టులు చేయడం ప్రజాస్వామిక గొంతుకలను అణచివేయడమేనని ఆయనన్నారు. ఇన్నయ్య అరెస్టును అభిప్రాయ వ్యక్తీకరణ స్వేచ్ఛపై జరిగిన దాడిగా భావించి ప్రజాస్వామిక వాదులందరూ వ్యతిరేకించాలని జాన్ వెస్లీ పిలుపునిచ్చారు.