బెంగళూరు: కులాంతర వివాహం చేసుకుందని కూతురును కన్నతండ్రి చంపిన సంఘటన కర్నాటక రాష్ట్రం ధర్వాడా ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…హుబ్బళ్లి గ్రామంలో ప్రకాశ్ ఫక్కిర్‌గోడా అనే తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. ఆయన కుమార్తె మాన్య పాటిల్(19) అదే గ్రామానికి చెందిన ఓ యువకుడిని ప్రేమించింది. ప్రేమ పెళ్లికి అంగీకరించకపోవడంతో ఇంట్లోని నుంచి పారిపోయి వివాహం చేసుకుంది. గ్రామంలో ఉంటే తనని చంపేస్తారనే భయంతో గ్రామానికి వంద కిలో మీటర్ల దూరంలో హవేరి జిల్లాలో తన భర్తతో కలిసి నివసిస్తోంది. మాన్య పాటిల్ ఆరు నెలల గర్భవతిగా ఉంది. తన భర్తతో కలిసి అత్తింటికి వచ్చింది. అత్త మామలు పొలం పనులు వెళ్లిన తరువాత కూతురుపై తండ్రి దాడి చేయడానికి ప్రయత్నించాడు. ఆమె తప్పించుకోవడంతో సాయంత్రం మరో ఇద్దరు బంధువులతో కలిసి ఇనుప రాడ్ లతో కూతురుపై దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ దాడిలో మన్యం పాటిల్ అత్తామామలు రేణుకమ్మ, సుభాష్ కూడా గాయపడ్డారు. స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.