నా మరణం ముఖ్యం కాదు
నీవు బతకాలి, నా కథలు వినిపించాలి
గతానికి ప్రతినిధిని నేనైనా,
భవిష్యత్తుకు రాజువు నీవే
చరిత్రలేనిదే వర్తమానానికి,
భవిష్యత్తుకు పునాది లేదు
నా మరణం ముఖ్యం కాదు,
చరిత్రకు మరణం ఉండదు
రేపటి చరిత్రకు ఈ రోజు
సంతకంగా నీవు బతకాలి
మన స్నేహానికి మధ్య వున్న
గాఢతకు మరే రుజువులు అఖ్ఖర్లేదు
ఈ దేహం మట్టి, ధూళి మాత్రమే కాదు,
నీడనిచ్చే చెట్టు కూడా
ఈ స్నేహంలో పచ్చనాకుల ఒగరు,
పూల పరిమళం కూడా వుంది
యుద్దానికి ఆయుధాలు అఖ్ఖర్లేదు
మన స్నేహమే ఒక తిరుగులేని ఆయుధం
డా.రూప్ కుమార్, డబ్బీకార్