దేవరకొండ బాలగంగాధర తిలక్ (1921–1966) కవితా సంపుటి, ‘అమృతం కురిసిన రాత్రి’, ఆ రోజుల్లో అందరూ ఇష్టపడి చదివేవారు. కాలేజీల్లోనూ బయటా వక్తృత్వపు పోటీల్లోనూ ఇతరేతర పోటీల్లోనూ గెలిచినవారికి ఈ సంపుటినే బహుమతిగా ఇచ్చేవారు. ఈ కవిత లు చదివి తిలక్ శబ్దాలంకారాలకు అచ్చెరువొంది మెచ్చుకోనివారు అ రుదు. తిలక్ కవిత్వాన్ని ఆస్వాదించడం సులువు. పాఠకుడికి ఉండాల్సిందల్లా కవిత్వం పట్ల అభిరుచి. అమృతం కురిసిన రాత్రిలో అంత్యప్రాసలూ alliteration, పదబంధా ల్లో తూగూ, ఊపూ ఇంకా చాలా రక్తికట్టే poetic devices కొల్లలు గా కనిపిస్తాయి. కర్ణపేయమైన పదబంధాలు పఠితలను కవితోపాటు కవి ప్రస్థానంలో భాగస్వాములను చేస్తాయి.
‘కవిత్వం కొద్దిగా రాసినా, ఎక్కువగా రాసినా తన సొంతమని చెప్పుకోదగిన శైలిని స్థాపించుకోలేనివాడు సాహిత్య చరిత్రలో నిలదొక్కుకోలేడు. వచనకవితా ప్రక్రియను పరిపుష్టం చేసిన కొద్దిమందిలో తిలక్‌కు ప్రత్యేకమైన స్థానం ఉంది’. అంటూ కుం దుర్తి (ఆంజనేయులు) తిలక్‌కు కితాబిచ్చి ప్రశంసి స్తూ తిలక్ కవిత్వం గూర్చి తనకున్న reservation s కూడా చెప్పారు. తిలక్ కొంచెం సాంప్రదాయిక శైలిని ఎక్కువ వాడాడనీ, ఆధునిక కవితా సామగ్రి తిలక్ పద్య నిర్మాణంలో కాస్త తక్కువున్నదనే అర్థం వచ్చేవిధంగా రాశాడు కుందుర్తి తన ముందుమాటలో. అయితే, కుందుర్తి ఏ మొహమాటమూ లేకుండా మెచ్చుకున్న కవితలు అభ్యుదయాన్ని కాంక్షించేవి. కుందుర్తికి శబ్దాలంకారల మీద మోజు లేదనే అనిపిస్తుంది ఆయన ముందుమాట చదివినవారికి. అయితే కుందుర్తి classical learn ing మెండుగా ఉన్న కవి. స్వయానా గేయరూపం నుంచి ఆధునిక అభ్యుదయ కవిత్వాన్ని వచనానికి తరలింపజేసిన నయాగారా కవి. ‘సారళ్య సుందరి వరించిన కవిత్వమే’ (ఇదీ కుందుర్తి పేర్చిన పదబంధమే) కుందుర్తి భేషుగ్గా ఉందంటాడు. కుం దుర్తి తిలక్‌కు పరిచయస్థుడు. కవిత్వానికి అందం అలంకారాల వల్లనూ, నిరాడంబరత వల్లనూ కలుగుతుంది. పూర్వం రాసిన శ్రేష్ఠ కవులను చదివి అంతో, ఇంతో అలంకార ప్రయోగాలను అరువు తెచ్చుకోవడంలో దోషం లేదు.
1941లోనే తిలక్ తన మేనిఫెస్టో కవిత (నా కవిత్వం)లో ఇలా చెప్పుకున్నాడు.
నా అక్షరాలు కన్నీటి జడులలో
తడిసే దయాపారావతాలు
నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే
విజయ ఐరావతాలు
నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే
అందమైన ఆడపిల్లలు
పై వాక్యాలు కవిని మానవతావాదిగా ప్రజాభ్యుదయాన్ని కాంక్షించేవాడిగా సౌందర్యారాధకుడిగా నిలబెడుతున్నాయి. ఈ నిర్వచనానికతీతంగా తిల క్ ఏమీ రాయలేదు. ఈ నిర్వచనానికందే కవితలు తిలక్ బాగా రాశాడు. ఎంతలా అంటే పాఠకులు చదివి మర్చిపోలేని విధంగానూ quote చేసేట ట్టూ, డైరీలో రాసుకొని భద్రపరుచుకునే విధంగానూ. ఆధునిక తెలుగు కవిత్వం గేయ రూపం నుంచి వచన కవితగా పరిణమిల్లే దశలో తిలక్ తన ప్రతిభతో రెండు విధానాలనూ సమాదరిస్తూ, రెంటినీ కలుపుతున్న వారధిగా నిలిచాడు. తిలక్‌లో లయా, మాధుర్యమూ కలగలిసి కవితను తీర్చిదిద్దాయి.
రాత్రి కురిసిన అమృతా న్ని ‘దోసిళ్ళతో తాగి తిరిగొచ్చిన’ తిలక్, ‘పృథువక్షోజనితంబభార’లైన అప్సరసలను చూసిన త రువాతే, దుఃఖానికి నెలవైన ప్రపంచాన్ని చూశా డు. అయితే, రాజుని చూసిన కళ్ళతో మొగు ణ్ణి చూస్తే మొత్త బుద్ధి అందరికీ పుట్టదు. తిల క్ కేవలం తనకే ‘కాంక్షామధురకాశ్మీరాంబరం’ కావాలనుకోలేదు. అందం, ఆనందం అందరికీ అని నమ్మిన కవి కనుక లోకదైన్యాన్ని ఆర్ద్రనయనాలతో రాయలేక రాశాడు. తిలక్ ఈ ప్రపంచానికి శుభ్రస్ఫటికం వంటి అద్దమే పట్టినా ఈ ప్రపంచపు మకిల అద్దానికి అంటుకుంది. ఒక్క మలినాశ్రువున్నంతవరకూ కవికి శాంతి లేదు. ముఖ్యంగా తన కాలంలోని జరిగిన యుద్ధాలకూ మారణహోమాలకూ చలించి వీటికెవరు బాధ్యులా అన్న మహాప్రశ్న తనను పీడించగా,
కురుక్షేత్రమైతే కృష్ణుణ్ణడుగు
పానిపట్టైతే పీష్వాలనడుగు
బొబ్బిలయితే బుస్సీనడుగు
క్రిమియా యుద్ధం కొరియా యుద్ధం
ప్రథమ ద్వితీయ ప్రపంచయుద్ధాలు
బిస్మార్క్ నడుగు హిట్లర్ నడుగు
బ్రహ్మదేవుణ్ణడుగు
(వెళ్ళిపొండి వెళ్ళిపొండి) అని, అలా అన్న ఆ తీర్మానంలోనూ తొంగిచూసే అసంతృప్తి కవికీ తెలుసును, కనుకనే ‘దేవుడూ, మానవుడూ వీరిద్దరే, ఈ అనంత విశ్వంలో మూ ర్ఖులు ఏ కోణంనుంచి చూచినా వీరిద్దరూ మిజరబుల్ ఫెయిల్యూర్స్’ అని ఒక దండం పెట్టేశాడు. ప్రపంచశాంతిని పరారీలో ఉన్న వ్యక్తిగా పరిగణిస్తూ ‘ప్రకటన’ చేశాడు. తిలక్‌కు మనుషులంటే జాలి, దయతో పాటుగా అసహనం కూడా (గొంగళిపురుగులు, నీడ లు వంటి కవితలు చూడండి). విసిగి వేసారిన వేళ ఎవరు నన్ను పలాయనవాది అనుకుంటే నాకేమిటన్నట్టు ద్రాక్షాసవపానం చేస్తూ సరుగుడు చెట్ల నీడల్లోకి పరుగెత్తాడు. ‘సంప్రదాయ భీరువుకీ అస్వతంత్ర వితంతువుకూ వసంతం లేదు’ అని అన్న కవి మన కు తన స్వేచ్ఛాగీతాల పుష్పగుచ్ఛం మొహమాటంగా అందించాడు. దీని అందచందా లు గొప్పవే. కానీ అందిస్తున్నప్పటి మానవ స్పర్శ వల్ల కాస్త కమురు వాసన కూడా తప్పలేదు. తిలక్‌కు విశ్వనాథ, కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ అంటే ఎంత గౌర వం ఉన్నా కొంత reservation లేకపోలేదు (త్రిమూర్తులు). తిలక్ తనను తాను ప్రశ్నించుకున్నది తక్కువ. వెతుకులాట తిలక్‌లో ఎక్కువ. కవులంద రూ తమ తమ కవిత్వంలో దొరుకుతారు. తిలక్ తన కవిత ‘మన సంస్కృతి’లో దొరికినంతగా ఇంకెందులోనూ మనకు దొరకడు. తిలక్ రాసిన ‘నువ్వు లేవు నీ పాట ఉంది’ కలకాలం నిలిచే జాలి, ప్రేమల జమిలి కవిత. మధ్యతరగతి మనుషులంటే చికాకుతో కుడిన అసహనం. ప్రేమికలు ‘ప్రత్యూష పవన లోల మందార లతాంతాలు’ వయసు మళ్ళిన భార్య ‘విధి గీసిన చిత్తరువు’, ‘ప్రవహ్లిక’ అనే కవితలో స్త్రీని ఉద్దేశిస్తూ, ‘నువ్వు తల్లివి, నెచ్చెలివి, చెలివి నన్ను కౌగిలించుకున్న పెద్దపులివి’ అన్న తిలక్, ఇంకో కవితలో కేవలం గాఢమైన ఉపమానం కోసం, ‘చెరచబడ్డ జవ్వని విడివడిన పృథుశిరోజ భారంలాగ.. నిశీథం’, ఉపమానం కోసం revolting పోలిక, ఇక్కడ జవ్వని అనడమే ఘోరం. ‘దరిద్రం సముద్రంలో వేదనల తెరచాపలెత్తి ప్రయాణించే జీవననౌకలకి మృత్యువే లైట్‌హౌస్’. ఇది remorseless fatalism. ఇది ఆకాలానికి చెందిన విలువ అని కప్పిపుచ్చెయ్య లేం. విమర్శకూ, ఖండనకూ ఎవరూ ఏ రచనా అతీతం కాదు. పద్యాల్లో రూప వైవిధ్యం గొప్పగా ఉంటుంది. మాత్రాచ్ఛందస్సునూ prose poem నూ తిలక్ బాగా రాశాడు. భాషలో జాను తెనుగూ, దీర్ఘసంస్కృత సమాస ప్రయోగాలు సమర్థవంతంగా నడిపాడు.
చివరిగా తిలక్ ఒక సంధి యుగం కవిగా శబ్దాలంకారాల సింహాసనంపై కొలువుదీరిన అర్ధసంప్రదా య అర్ధాధునిక romantic కవిగా మిగిలిపోతా డు. ఇది negative తీర్పు కాదు. తిలక్‌ను మళ్ళీ మళ్ళీ చదవండి. ‘ఉపనిషదర్థ మహోదధినిహిత మహిత రత్నరాసు’లంటే ఆరాధన, ‘ప్రాగ్దిశాసుందరి ఖండచంద్ర పరిదీపిత కపోలాల’ హసనం అంటే వెర్రి, ‘కూపస్థమండూకోపనిషత్తు’ అంటే అసహనం. కవితల్లో మాధుర్యం మిమ్మల్ని కట్టిపడేస్తుంది. కవి కవితను ఎత్తుకున్న తీరూ నడిపిన విధానం ముగించిన పద్ధతీ మిమ్మల్ని ముగ్ధుల్ని చేస్తాయి. కవితా నిర్మాణ కౌశల్యానికి పెట్టింది పేరై తిలక్ వెలుగుతాడు. తిలక్ కవితలు ‘గాజు కెరటాల వెన్నెల సముద్రాలు’.
వాసు