జనవరి 2 నుంచి శాసనసభ
తెలంగాణకు ఎవరేం చేశారో అక్కడే మాట్లాడుదాం
పాలమూరుపై పచ్చి అసత్యాలు చెప్పారు
మీ హయాంలోనే అత్యధిక జలదోపిడీ
కృష్ణా జలాలపై తెలంగాణకు మరణశాసనం రాసిందే మీరు
పదేళ్లలో ఒక్క ప్రాజెక్టూ నిర్మించలేదు
కాంట్రాక్టర్లు కమీషన్ల కోసమే ఎత్తిపోతల పథకాలు చేపట్టారు
కెసిఆరే చంద్రబాబు నాయుడి శిష్యుడు
పట్టిసీమను అభినందించింది మీరు కాదా?
అల్లుడు, కొడుకు కుర్చీ కోసం కొట్టుకుంటుంటే తప్పనిసరై బయటికి వచ్చారు
బిడ్డ కవితకు సారె పెట్టలేక బయటికి సాగనంపారు
కెసిఆర్ ఆర్థిక ఉగ్రవాది
మీరు చేసిన లక్షల కోట్ల అప్పులకు వడ్డీలు చెల్లించేందుకే తిరిగి మేం అప్పులు చేస్తున్నాం
పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు వాత పెట్టడంతో కనువిప్పు కలిగింది
మీడియాతో చిట్‌చాట్‌లో కెసిఆర్‌పై సిఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం
మన తెలంగాణ / హైదరాబాద్ : కేసీఆర్ మారుతారని ఆశించినా ఎలాంటి మార్పులు రాలేలదని, మళ్లీ అవే అబద్ధాలు చెబుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రాజకీయ భిక్ష పెట్టిన ప్రాంతం గురించి పచ్చి అసత్యాలు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆదివారం బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఆదివారం ఆయన మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ తెలంగాణకు కేసీఆర్ చేసిన మేలు కంటే..అన్యాయమే ఎక్కువ చేశారన్నారు. ఆరోపణలు చేయడం కాదు..దమ్ముంటే చర్చకు రావాలి.. వచ్చే జనవరి 2వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు పెడతాం..దమ్ముంటే కేసీఆర్ సమావేశాలకు రావాలని సీఎం రేవంత్ సవాల్ చేశారు. తెలంగాణకు ఎవరేం చేశారో సభలోనే చర్చిద్దామని, కలుగులోంచి ఎలుక బయటకు వచ్చినట్లు నేడు కేసీఆర్ బయటకు వచ్చారని విమర్శించారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు వాత పెట్టడంతో కనువిప్పు కలిగిందన్నారు. కేసీఆర్ ఆర్థిక ఉగ్రవాది అని, రూ.8 లక్షల కోట్ల అప్పులు చేశారని ఆరోపించారు. నాలుగు రకాలుగా అవకాశాలు ఉంటే అన్ని రకాల అప్పులు చేశారని ఆరోపించారు.
కెసిఆర్ హయాంలోనే అత్యధిక జల దోపిడీ
కెసిఆర్ హయాంలోనే అత్యధిక జలదోపిడీ జరిగిందని, మూడు జిల్లాలకు మరణ శాసనం రాసిందే కెసిఆర్ అని రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. పాలమూరు రంగారెడ్డికి జూరాల నుంచి నీటిని తీసుకుంటే మన హక్కులు మనకు ఉండేవని, కాంట్రాక్టర్లకు అమ్ముడుపోయి కేసిఆర్ లిఫ్టులు కట్టారని ఆరోపించారు. జలాలు నిజాలపై అసెంబ్లీలో చర్చిద్దాం రండి..కెసిఆర్ చేసిన ద్రోహం ఏ నాయకుడు చేయలేదని విమర్శించారు. అసలు చంద్రబాబు శిష్యుడే కేసీఆర్ అని, పట్టిసీమను అభినందిస్తున్నానని అన్నదే కేసీఆర్ అన్నారు. ఆయన తమలపాకుతో కొడితే తాను తలుపు కర్రతో కొడతా..ఆయన విసనకర్రతో కొడితే నేను నీటి తొట్టితో కొడతా..కొడుకు అల్లుడు కొట్టుకుంటున్నారని కేసీఆర్ బయటకు వచ్చారని అన్నారు. ముఖాముఖి చర్చలకు రమ్మంటే ముఖం చాటేస్తున్నాడని, కుర్చీ కోసం అల్లుడు కొడుకు కేసీఆర్ చావు కోరుకుంటున్నారని చెప్పారను. కెసిఆర్ ఆరోగ్యంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా అని సీఎం పేర్కొన్నారు.
కృష్ణా మీద కేసీఆర్ ఒక ప్రాజెక్టు కట్టలేదు
పదేళ్ల కాలంలో కృష్ణా మీద కేసీఆర్ ఒక ప్రాజెక్టు కట్టలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాంట్రాక్టర్లకు అమ్ముడుపోయి కేసీఆర్ వేలకోట్ల కమిషన్లు దండుకున్నారని, పదేళ్ల లో కృష్ణా నదిపై రెండు లక్షల కోట్లు ఖర్చుపెట్టి లక్ష 80 కోట్ల బిల్లులు చెల్లించారని ఆరోపించారు. ఏపీ జలదోపిడికి దోహదం చేసింది కేసీఆర్ అని ధ్వజమెత్తారు. జూరాల దగ్గర ఓడిసి పట్టుకోవాల్సిన కృష్ణా జిల్లాలను శ్రీశైలం నుండి ఇచ్చి ఏపీకి రాసిచ్చారని విమిర్శంచారు. 811 టిఎంసి లలో 512 టిఎంసిలు ఏపీకి, తెలంగాణకు 299 టీఎంసీలతో తెలంగాణ ప్రజలకు మరణ శాసనం రాశారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై నిజనిర్ధారణ కమిటీ వేద్దామని కోరారు. పాలమూరు రంగారెడ్డి కట్టవద్దన్న హర్షవర్ధన్ రెడ్డికి బీఫామ్ ఇచ్చింది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి దివాళా తీయించింది కేసీఆర్ అని విమర్శించారు.
జనవరి 2 నుంచి అసెంబ్లీ సమావేశాలు
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో శీతాకాల అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ సమావేశాలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా శీతాకాల అసెంబ్లీ సమావేశాలపై క్లారిటీ ఇచ్చారు. జనవరి 2 నుంచి అసెంబ్లీ సమావేశాలు పెడతామన్నారు. అసెంబ్లీ సమావేశాలు మూడు రోజుల పాటు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలపై సీఎం అధ్యక్షతన అనధికారిక సమావేశం జరగనున్నట్లు తెలిసింది. సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల తేదీలు ప్రకటించడంతో పాటు ఎన్ని రోజులు నిర్వహంచాలన్న అంశంపై కూడా స్పష్టత రానుంది. ఈ సమావేశాల్లో 7 ఆర్డినెన్స్‌ల స్థానంలో బిల్లులు ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలు ఎలా? అన్ని రాజకీయ పక్షాల నుంచి అభిప్రాయాల కోసం చర్చలు సాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.