చెన్నై : ఈ నెల 24వ తేదీ బుధవారం ఇస్రో ఎల్‌విఎం 3 ఎం 6 ప్రయోగం ద్వారా బ్లూబర్డ్ బ్లాక్ 2 శాటిలైట్‌ను కక్షలోకి పంపిస్తుంది. అమెరికాకు చెందిన ఎఎస్‌టి స్పేస్ మోబైల్ తో కుదిరిన వాణిజ్య ఒప్పందంలో భాగంగా ఈ శాటిలైట్‌ను నిర్ణీత ప్రాంతానికి తరలిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ల సేవలను మరింత బలోపేతం చేసేందుకు ఈ శాటిలైట్ ఉపయోగపడుతుంది. ఈ మేరకు దీనిని రూపొందించారు. ఎఎస్‌టి స్పేస్ మొబైల్ కంపెనీ వారు తొలిసారిగా ప్రపంచ స్థాయిలో అంతరిక్ష ఆధారిత సెల్యూలర్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ప్రధానమైనది ఈ శాటిలైట్‌ను విజయవంతంగా కక్షలోకి చేర్చడమే. వాణిజ్యపరంగా వినియోగదారులకు, పలు ప్రభుత్వ యాప్‌లకు ఈ నూతన సెల్యూలర్ నెట్‌వర్క్ ఉపయోగపడుతుంది.
ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు పలు విధాలుగా సాంకేతిక పరమైన లోపాలను ఎదుర్కొంటున్నారని ఎఎస్‌టి తమ వెబ్‌సైట్‌లో తెలిపింది. ఈ లోపాలను సరిదిద్దడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరు బిలియన్ల మంది వినియోగదారులకు ప్రయోజనం చేకూరేలా చేస్తామని వివరించారు. అంతేకాకుండా ఇప్పటికీ ఫోన్ల అనుసంధానం లేని కోటానుకోట్ల మందికి ఈ శాటిలైట్ ప్రసారాల ద్వారా సరికొత్త సేవలు అందిస్తామని తెలిపారు. బ్లూబర్డ్ శాటిలైట్ల శ్రేణి ద్వారా బ్రాడ్‌బ్యాండ్ సేవల విస్తృతానికి కంపెనీ ఏర్పాట్లు చేసుకుంది. ఇందులో భాగంగానే ఇస్రోతో ఒప్పందం కుదుర్చుకుని ఈ శాటిలైట్‌ను కక్షలోకి పంపించేందుకు సిద్ధమయ్యారు. భారతీయ అంతరిక్ష సంస్థ ఇస్రోకు ఈ శాటిలైట్ ప్రయోగం వాణిజ్యపరమైన దిశలో ఉపయుక్తం అవుతుంది.