మన తెలంగాణ/హైదరాబాద్‌ః అధికారంలోకి రాగానే విదేశాల్లో ఉన్న నల్లధనం తెస్తామన్న హామీ ఏమైందని పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డిని ప్రశ్నించారు. ఏఐసిసి అగ్ర నాయకురాలు సోనియా గాంధీకి కిషన్ రెడ్డి లేఖ రాయడంపై జగ్గారెడ్డి ఆదివారం విలేకరుల సమావేశంలో తీవ్రంగా మండిపడ్డారు. దేశ ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలకు విదేశాల్లో ఉన్న నల్లధనం తెచ్చి ప్రతి అకౌంట్‌లో పదిహేను లక్షల రూపాయలు వేస్తామని బిజెపి ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. ఈ హామీ సంగతి ఏమైందో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు.
ఈ హామీల గురించి కిషన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాయాలని ఆయన డిమాండ్ చేశారు. కిషన్ రెడ్డి ఆ విధంగా లేఖ రాస్తే తాము ఆయన లేఖకు సమాధానం ఇస్తామని జగ్గారెడ్డి అన్నారు. సోనియా గాంధీని ప్రశ్నించే నైతిక హక్కు బిజెపికి లేదని ఆయన దుయ్యబట్టారు. సోనియా గాంధీ హామీ ఇచ్చిన మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించే సౌకర్యం కల్పించామని, ఐదు వందల రూపాయలకే వంట గ్యాస్ సిలెండర్ ఇస్తున్నామని జగ్గారెడ్డి తెలిపారు. అధికారంలోకి వచ్చి పదకొండు సంవత్సరాలు దాటినా ఇచ్చిన హామీలను బిజెపి నిలబెట్టుకోలేదని, తాము అధికారంలోకి వచ్చిన రెండేళ్ళలోనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నామని జగ్గా రెడ్డి తెలిపారు.