హైదరాబాద్: కేంద్రం, రాష్ట్రం పాలమూరు ప్రాజెక్టుకు చేసిన ద్రోహంపైనే భేటీలో చర్చ జరిగిందని బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ తెలిపారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఆయన బిఆర్ఎస్ బిఆర్ఎస్ శాసనసభాపక్షం, రాష్ట్ర కార్యవర్గ భేటీ తెలంగాణ భవన్‌లో జరిగింది. పార్టీ ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యవర్గ సభ్యులతో భేటీ అయ్యారు. భేటీ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో కెసిఆర్ మాట్లాడుతూ.. సమైక్య రాష్ట్రంలో ఎక్కువ అన్యాయానికి గురైన జిల్లా పాలమూరు అని అన్నారు. 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్, 20 ఏళ్లు పాలించిన టిడిపి పాలమూరుకు ద్రోహం చేశాయని మండిపడ్డారు.
174 టిఎంసిలు పాలమూరు జిల్లా ప్రాజెక్టులకు రావాల్సి ఉందని కెసిఆర్ తెలిపారు. ‘‘ఆంధ్రప్రదేశ్ ఏర్పాటే తెలంగాణ, ప్రత్యేకించి పాలమూరు పాలిట పెనుశాపం. పాలమూరు జిల్లాలో కృష్ణానది 300 కి.మి. ప్రవహిస్తుంది. బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ ముందు చాలా వాదించాం. ఉద్యమ సమయంలో పాలమూరుకు జరిగిన అన్యాయం వివరించాం. రాష్ట్రాల మధ్య వివాదాలు పరిష్కరిస్తామని ట్రైబ్యునల్ చెప్పింది. బచావత్ ట్రైబ్యునల్ పంపకాల్లో పాలమూరు గురించి స్పష్టంగా చెప్పారు. పాలమూరు కోసం గంటెడు నీళ్లు అడిగిన వాళ్లే అప్పుడు లేరు. 1974లో బచావత్ ట్రైబ్యునల్ 17 టిఎంసిలు జూరాలకు సుమోటోగా కేటాయించింది. అంజయ్య కాలంలో జూరాల ప్రాజెక్టు నిర్మాణం జరిగింది’’ అని కెసిఆర్ వివరించారు.
అయితే జూరాల ప్రాజెక్టు మాత్రమే కట్టారు కానీ కాల్వలు లేవని కెసిఆర్ పేర్కొన్నారు. ‘‘అప్పుడు సిఎంగా ఉన్న చంద్రబాబు పాలమూరును దత్తత తీసుకున్నారు. అప్పట్లో చంద్రబాబు ఎన్నో ప్రాజెక్టులకు పునాదిరాళ్లు వేశారు. ఆ పునాదిరాళ్లన్నీ ఓ చెక్‌డ్యామ్ అవుతుందని నేను ఉద్యమ సమయంలో చెప్పా. పాలమూరులోని మండల కేంద్రాల నుంచి ముంబయికి బస్సులుండేవి. పాలమూరు నుంచి ముంబైకి విస్తృతంగా వలసలు ఉండేవి. గోరటి వెంకన్న కూడా పాలమూరు వలసలపై పాట రాశారు. సమైక్య రాష్ట్రంలోనే సమగ్రాభివృద్ధి పేరిట చంద్రబాబు సభలు పెట్టారు. జూరాల ప్రాజెక్టు కోసం పరిహారం డబ్బు చంద్రబాబు కట్టలేదు. నా విమర్శలకు తట్టుకోలేక చంద్రబాబు కర్ణాటకకు డబ్బు కట్టారు. నేను ఉద్యమం మొదలుపెట్టాక తొలిసారి జోగులాంబ-గద్వాల పాదయాత్ర చేశా’’ అని కెసిఆర్ పేర్కొన్నారు.
ఎంతో అధ్యయనం చేశాకే జోగులాంబ-గద్వాల పాదయాత్ర చేశానని కెసిఆర్ అన్నారు. ‘‘ఉద్యమం తర్వాత తెలంగాణ ఏర్పాటైంది. తెలంగాణ వెనుకబడ్డ ప్రాంతం కాదు.. వెనక్కు నెట్టివేయబడ్డ రాష్ట్రమని పదే పదే చెప్పా. గంజి కేంద్రాలు పెట్టాల్సిన దుస్థితికి పాలమూరు ఆనాడు దిగజారింది. రాష్ట్రం వచ్చాక ప్రాజెక్టుల పరిస్థితిపై పూర్తి అధ్యయనం చేశాం. పాలమూరు జిల్లాకు ప్రథమ ప్రాథాన్యత ఇవ్వాలని నిర్ణయించాం. చంద్రబాబు పెండింగ్ పెట్టిన ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చాం. పాలమూరు జిల్లాలో ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్లిచ్చాం. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా తదితర ప్రాజెక్టుల ద్వారా ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్లిచ్చాం. 300 కి.మి. కృష్ణ నది పారే జిల్లాలోు గతంలో 30 వేల ఎకరాలు కూడా ఆయకట్టు లేదు. పాలమూరు జిల్లాలో వందల కొద్దీ చెక్‌డ్యాములు కట్టాం. తుమ్మిళ్ల లిఫ్ట్ పూర్తి చేసి ఆర్డిఎస్ ద్వారా జరిగిన నష్టాన్ని భర్తీ చేశాం’’ అని కెసిఆర్ తెలిపారు.