మన తెలంగాణ/హైదరాబాద్‌ః ప్రముఖ సినీ నటి ఆమని బిజెపిలో చేరారు. శనివారం ఆమె తన సహచరురాలు, ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్, నంది అవార్డు గ్రహిత శోభలతతో కలిసి నాంపల్లిలోని బిజెపి రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు వారికి స్వాగతం పలికారు. ఆ తర్వాత రాంచందర్ రావు వారిపై పార్టీ కండువా కప్పి, పార్టీ సభ్యత్వం ఇచ్చారు.
ఈ సందర్భంగా రాంచందర్ రావు ప్రసంగిస్తూ తెలుగు, తమిళ, కన్నడ సినీ పరిశ్రమలలో ప్రముఖ నటులతో ఆమని కలిసి అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందారని, అదే విధంగా వివిధ టివి సీరియల్స్‌లోనూ నటిస్తున్నారని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ సుపరిపాలనతో ఆకర్షితులై, తాము కూడా దేశానికి సేవ చేయాలన్న భావనతో ఆమని, శోభలత పార్టీలో చేరడం సంతోషకరమని ఆయన అన్నారు.