పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం సంస్కరణల పేరు తో వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడమే కాక, మందబలంతో ఏకచ్ఛత్రాధిపత్యం వహించింది. విపక్షాలు లేవదీసిన అభ్యంతరాలకు సరైన సమాధానాలు చెప్పడం లేదు సరికదా, చర్చకు కూడా అవకాశం లేకుండా బుల్‌డోజర్ సంస్కృతి అవలంబించింది. ఉన్నత విద్యారంగాన్ని తన గుప్పెటలో పెట్టుకోవడానికి శ్రీకారం చుట్టింది. ఆత్మనిర్భర్ భారత్ నినాదంతో ఇతర దేశాలపై ఆధారపడే దుస్థితినుంచి బయటపడాలంటూ పదేపదే ప్రబోధించే మోడీ ప్రభుత్వం బీమా, అణువిద్యుత్ రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు స్వాగతం పలకడం, ముఖ్యమైన వ్యవస్థలను విదేశాలకు తాకట్టుపెట్టడం ఈ పార్లమెంట్ సమావేశాల్లో ప్రత్యేకత. ఇది కాక యుపిఎ ప్రభుత్వ చిహ్నాలను, మహాత్మాగాంధీ పేరును పూర్తిగా చెరిపేసేందుకు చరిత్రాత్మక జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసింది. ఈ పథకాన్ని తన అధీనం లోకే తెచ్చుకుని తన పెత్తనంతోనే పనులు సాగేలా మార్చుకుంది.ఈ పథకంలో 100 రోజుల పనిదినాలను 125 రోజులకు పెంచి ఉద్ధరిస్తున్నట్టు నమ్మిస్తున్నా దాని అసలు స్వరూపం వేరేగా ఉంటోంది. ఏ రాష్ట్రంలో, ఎక్కడ, ఏ పనులు చేపట్టాలో కేంద్రమే నిర్ణయిస్తుంది.
ఏ రాష్ట్రానికి ఎంత బడ్జెట్ కేటాయిస్తుందో ఆ మేరకే పనులు చేపట్టాలి. అదీ కూడా అవసరం బట్టే పని కల్పన ఉంటుంది. అంటే రాష్ట్రాలకు ఇందులో ఎలాంటి స్వేచ్ఛ లేనట్టే. ఇక నిధుల వ్యయంలో ఇంతవరకు శ్రామికుల వేతనాలు పూర్తిగా, సామగ్రి వ్యయంలో 75% నైపుణ్యం, పాక్షిక నైపుణ్య కార్మికుల వేతనాల్లో 75 శాతం కేంద్రమే చెల్లించేది. కానీ ఇకనుంచి మొత్తం వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వమే 40 శాతం వరకు భరించక తప్పదు. 90ః 10 గా ఉన్న వ్యయం ఇకనుంచి 60ః40 గా ఉంటుంది. ఇంత భారీ వ్యయాన్ని రాష్ట్రాలు ఎంతవరకు భరించగలవో ఆలోచించాలి. ఈ వివాదాస్పద నిర్ణయంపై కాంగ్రెస్‌తో సహా విపక్షాలన్నీ భగ్గుమంటున్నాయి. జాతీయ స్థాయిలో వ్యతిరేక ఉద్యమానికి సన్నద్ధమవుతున్నాయి. కేంద్రం మితిమీరిన పెత్తనానికి మరో తార్కాణం ఉన్నత విద్యారంగం. ఉన్నత విద్య క్రమబద్ధీకరణ చట్టాన్ని పూర్తిగా ఏకీకృతం చేస్తూ వికసిత్ భారత్ శిక్షా అధిష్ఠాన్ (వి బిఎస్‌ఎ) బిల్లును తీసుకొచ్చింది. యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యుజిసి), ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ (ఎఐసిటిఇ), నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్స్ ఎడ్యుకేషన్ (ఎన్‌సిటిఇ) పర్యవేక్షణ అధికారాలన్నీ ఒకే రెగ్యులేటర్ కిందకు తెస్తూ హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పాటు చేస్తోంది.
అన్ని కేంద్ర యూనివర్శిటీలు, వాటి కిందగల కాలేజీలు, విద్యామంత్రిత్వశాఖ పరిపాలన కింద గల జాతీయ ప్రాముఖ్యత గల సంస్థలన్నీ ఈ కమిషన్ కిందకే వస్తాయి. ప్రస్తుతం యుజిసి కింద లేని ఐఐటిలు, ఐఐఎంలు, ఎన్‌ఐటిలు, ఐఐఎస్‌సిలు, ఐఐఎన్‌ఇఆర్‌లు, ట్రిపుల్ ఐటిలు కూడా ఈ కమిషన్ కిందకే వస్తాయి. ఈ విబిఎస్‌ఎ కమిషన్‌లో తనకు అనుకూలమైన తొమ్మిది మందిని కేంద్రమే నియమిస్తుంది. ఈ బిల్లుపై రాష్ట్రాలకు ఎలాంటి హక్కులు ఉండవు. రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన విశ్వవిద్యాలయాలు కూడా కేంద్ర అధిష్టానం ఆదేశాలకే లోబడాల్సి వస్తుంది. ఇక బీమా రంగంలో విదేశీ సంస్థలు పూర్తిస్థాయిలో ప్రవేశించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బీమా రంగంలో ప్రస్తుతం 74% వరకు ఉన్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 100 శాతం పెంచడానికి వీలుగా బిల్లును రూపొందించింది. జిడిపిలో 3 శాతం వాటాకు పరిమితమైన బీమారంగం ఇక నుంచి విదేశాల్లో మాదిరిగా ఆరున్నర శాతానికి చేరుతుందని ప్రభుత్వం నమ్మబలుకుతోంది.
నూరు శాతం ఎఫ్‌డిఐలతో విదేశీ కంపెనీలు తక్కువ మూలధనంతో ఇకపై ఇక్కడ వ్యాపారాలు పెట్టుకోవచ్చు. ఇప్పటివరకు 65 శాతం వాటాతో అత్యంత బలంగా ఉన్న ప్రభుత్వ రంగ ఎల్‌ఐసికి ఇప్పుడు అగ్నిపరీక్షే ఎదురవుతుంది. బీమా రంగంలో వంద శాతం ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులకు తలుపులు తెరిచిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అణుశక్తి బిల్లు రూపంలో మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. అణుశక్తిని స్థిరంగా వినియోగించుకుంటూ అభివృద్ధి పథం వైపు దేశాన్ని తీసుకెళ్లడమే లక్షంగా ‘శాంతి బిల్లు’ ను ప్రవేశపెట్టినట్టు మోడీ ప్రభుత్వం ప్రకటిస్తోంది. అణు విద్యుత్ సంస్థాపిత సామర్థం ప్రస్తుత 8.8 గిగావాట్లు నుంచి 2047 నాటికి 100 గిగావాట్లకు పైగా పెంపు చేయడమే లక్షంగా 2008లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అమెరికాతో సివిల్ అణుశక్తి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అయితే రియాక్టర్లలో ఏదైన ప్రమాదం సంభవిస్తే మానవ ప్రాణ, పర్యావరణ నష్టానికి ఆ రియాక్టర్ల సరఫరాదారు పరిహారం చెల్లించాలని సివిల్ లయబిలిటీ బిల్లు తీసుకు రాగా, అమెరికా కంపెనీలు వ్యతిరేకించడంతో బిల్లు అమలు కాలేదు.
ఈ పరిహారం విషయంలో సడలింపు కల్పించి దాన్ని మోడీ ప్రభుత్వం అమలులోకి తీసుకు వస్తోంది. 1962 అణుశక్తి చట్టం, 2010 పౌర అణు నష్టపరిహార చట్టాన్ని రద్దు చేయాలనే బిల్లు లోని నిబంధనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రమాదాలు సంభవించినప్పుడు రియాక్టర్ల సరఫరాదారుల నష్టపరిహార చెల్లింపు బాధ్యత కేవలం 300 మిలియన్ డాలర్లకే పరిమితం చేయడం ప్రజలభద్రతను నిర్లక్షం చేయడమే. జపాన్‌లో పుకుషిమా, రష్యాలో చెర్నోబిల్ అణుప్రమాదాలు నేర్పిన గుణపాఠాలు ఇప్పుడు విస్మరించడం ఎవరికీ క్షేమం కాదు. నియంత్రణలన్నీ ప్రభుత్వం చేతిలోనే ఉంటాయని చెబుతున్నప్పటికీ బహుళజాతి కంపెనీలు ఎంత శక్తిమంతమైనవో భోపాల్ యూనియన్ కార్బైడ్ గ్యాస్ లీక్ ప్రమాదం సంఘటనే ప్రత్యక్ష సాక్షం. ఈ బిల్లు ద్వారా అమెరికా, ఫ్రాన్స్ వంటి విదేశీ కంపెనీలకే తప్ప భారత కంపెనీలకు ప్రయోజనం శూన్యం అన్న విమర్శలు వస్తున్నాయి.