మన తెలంగాణ/నిజామాబాద్ బ్యూరో: జిల్లాలోని వర్ని గ్రామంలోని ఓ బ్యాంకులో చెలామణి చేయడానికి తెచ్చిన దొంగ నోట్లను అధికారులు గు ర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం సాయంత్రం మండల కేంద్రంలో వెలుగుచూసిన ఈ వ్యవహారంపై ప్రత్యేక పోలీస్ బృం దం గురువారం రాత్రి నుంచి దర్యాప్తు మొదలు పెట్టింది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని జలాల్‌పూర్ గ్రామానికి చెందిన సాయిలు అనే రైతు చాలా రోజులుగా పెండింగ్‌లో క్రాప్ లోన్‌ను క్లియర్ చేయడానికి గురువారం వర్నిలోని కెనరా బ్యాంకు వచ్చాడు. రూ.2.08 లక్షల నగదును బ్యాంకులో అందజేశాడు. అన్నీ రూ.500 నోట్లు కావడంతో బ్యాంక్ క్యాషియర్ వాటిని క్షుణ్ణంగా పరిశీలించారు.
తాను అనుమానించినట్లుగానే అవన్నీ దొంగనోట్లుగా నిర్ధారించుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన వచ్చి సాయిలును అదుపులోకి తీసుకుని విచారించారు. అంత డబ్బు ఎలా వచ్చిందని ప్రశ్నించగా తన కొడుకు ఇచ్చాడని, బ్యాం కులో లోన్ కట్టేయాలని చెప్పడంతో తెచ్చానని సమాధానం ఇచ్చాడు. దీం తో అతని కొడుకు కోసం పోలీసులు వెళ్లగా పరారీలో ఉండడంతో అతని కోసం గాలిస్తున్నారు. బాన్స్‌వాడ ప్రాంతంలో దొంగనోట్లు చెలామణి చేసే ముఠాను కామారెడ్డి పోలీసులు ఇటీవల పట్టుకున్నారు. ఆ ముఠాకు చెందినవారే ఈ దొంగనోట్లు ఇచ్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.