భర్త చేతిలో భార్య దారుణ హత్యకు గురైన సంఘటన గురువారం రాత్రి జోగులాంబ గద్వాల జిల్లా, ధరూర్ మండలం నెట్టెంపాడు గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కుర్వ గోవిందుకు అదే గ్రామానికి చెందిన కురువ జమ్ములమ్మ(28)తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు. గురువారం రాత్రి భార్యాభర్తలిద్దరి మధ్య మనస్పర్థ్థలు రావడంతో చిన్నపాటి గొడవ జరిగింది. తల్లిదండ్రుల మధ్య గొడవను సద్దు మణిగించేందుకు పెద్ద కొడుకు మల్లికార్జున్ జోక్యం చేసుకున్నాడు. దీంతో ఆగ్రహం చెందిన తండ్రి గోవింద్ కర్ర తీసుకొని అతని తలపై కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి.
దీంతో భార్య కేకలు వేయడంతో ఇంటి పక్కన ఉన్న వారు ఏం జరిగిందోనని ఇంటి తలుపులు తీయగా బయటకు పరుగులు తీసింది. వెంటనే భర్త కూడా వెంబడించి, నడిరోడ్డులో ఆమెను దారుణంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. నిందితుడు గతంలో కూడా తల్లిదండ్రులపై దాడికి పాల్పడిన కేసులో జైలు శిక్ష అనుభవించాడని, కొంతకాలం హైదరాబాద్ ఎర్రగడ్డలోని మెంటల్ హాస్పిటల్‌లో చికిత్స పొందినట్లు గ్రామస్థులు తెలిపారు. మృతదేహాన్ని గద్వాల జిల్లా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి శుక్రవారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నామని ఎస్‌ఐ శ్రీహరి తెలిపారు.