పార్లమెంట్ శీతాకాల సమావేశాలు శుక్రవారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. శుక్రవారం ఉభయ సభలు సమావేశమైన కాసేపటికే వాయిదా పడ్డాయి. కీలక అంశాలపై వాడివేడి చర్చలు, సర్‌పై ప్రతిపక్షాలు నిరసన మధ్య వాకౌట్లు, అనేక ముఖ్యమైన బిల్లులను ప్రభుత్వం ఆమోదింపచేసుకోవడంతో 19 రోజుల పాటు సాగిన సెషన్ సమాప్తం అయింది. ప్రత్యేకించి 20 సంవత్సరాల మహాత్మా గాంధీ రోజ్‌గార్ ఉపాధి హామీ పథకం (ఎంఎన్‌ఆర్‌ఇజిఎ) రద్దు, ఈ స్థానంలో నూతన పథకం తీసుకురావడం, పౌర అణు రంగంలో ప్రైవేటు ప్రాతినిధ్యం వీలు కల్పించే శాంతి బిల్లు ఆమోదం వంటివి ఈ క్రమంలో జరిగాయి. ముగింపు రోజున స్పీకర్ ఓం బిర్లా లాంఛనపూర్వక సంక్షిప్త వీడ్కోలు ప్రసంగం చేశారు. ఈసారి సెషన్ సత్ఫలితాలను ఇచ్చిందని ఇది 111 శాతంగా ఉందని తెలిపారు. సభ్యులు రాత్రి పొద్దుపోయే వరకూ కూడా ఉండి చట్టసభలో కీలక బిల్లులపై చర్చల్లో పాల్గొన్నారని, ఇది ఆశాజనకం అని స్పందించారు. ఆ తరువాత సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.
ఈ నెల 1వ తేదీన లోక్‌సభ శీతాకాల సమావేశాలు ఆరంభం అయ్యాయి. ఆయన ప్రసంగిస్తూ ఉండగా ప్రతిపక్ష సభ్యులు కొందరు ప్రధాని మోడీ సమక్షంలోనే మహాత్మా గాంధీకి జై అని నినాదాలకు దిగారు. రోజ్‌గార్ యోజనకు గాంధీజీ పేరు తీసివేయడంపై నిరసన వ్యక్తం చేశారు.జాతీయ గీతం వందేమాతరం 150 సంవత్సరాల ఘట్టం, ఎన్నికల సంస్కరణలు, సంబంధిత సర్‌పై వాడివాడి చర్చలు జరిగాయి. ప్రతిపక్ష అధికార పక్ష సభ్యుల మధ్య హోరాహోరీ వాదోపవాదాలు సాగాయి. జాతీయ గీతం వందేమాతరంపై చర్చను ప్రధాని మోడీ ఆరంభించి ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ దేశ చరిత్రకు ద్రోహం చేసిందని విమర్శించారు. వందేమాతరంపై ఏకంగా 11 గంటల 32 నిమిషాల పాటు చర్చ జరిగింది. ఇందులో 65 మంది సభ్యులు పాల్గొన్నారు. ఇక ప్రతిపక్షం ఈసారి ఓటర్ల జాబితాల సవరణల ప్రక్రియ సర్‌పై ప్రత్యేక చర్చకు పట్టుపట్టింది. అయితే ప్రభుత్వం ఇందుకు బదులుగా ఎన్నికల సంస్కరణల విషయంపైనే చర్చకు అనుమతిని ఇచ్చింది. ఈ క్రమంలో హోం మంత్రి అమిత్ షా ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. అక్రమ వలసదార్లు, చొరబాటుదార్లు ఓటర్ల జాబితాలో లేకుండా చేయడానికే ఎన్నికల సంఘం సర్‌ను చేపట్టిందని వివరించారు.
ఈ సందర్భంగా రాహుల్‌కు, అమిత్ షాకు మధ్య తీవ్రస్థాయి వ్యాగ్యుద్ధం నెలకొంది. ఎన్నికల సంస్కరణపై సభలో దాదాపు 13 గంటల పాటు చర్చ జరిగింది. అధికార పక్షం ఎన్నికల సంఘంతో కుమ్మక్కు అయ్యి, బలహీన వర్గాలు, వ్యతిరేక ఓటర్ల పేర్లు జాబితాల్లో లేకుండా చేసిందని విపక్షాలు ఎదురుదాడికి దిగాయి. చర్చలో అన్ని పార్టీలకు చెందిన 63 మంది ఎంపిలు పాల్గొన్నారు. ఈసారి సెషన్‌లో మొత్తం ఎనిమిది బిల్లులు ప్రవేశపెట్టారు. వీటిలో ఉపాధి హామీ పథకానికి సంబంధించి నూతనంగా విబి జి రామ్ జి బిల్లు సభలో ప్రభుత్వం ఆకస్మికంగా ప్రవేశపెట్టింది. అంతకు ముందటి మమాత్మా గాంధీ రోజ్‌గార్ హామీ పథకాన్ని రద్దు చేసింది. ఇక ఉన్నత విద్యాబిల్లు, సెంట్రల్ ఎక్సైస్ సవరణల బిల్లు వంటి ఇతర బిల్లులు కూడా తీసుకువచ్చారు.