ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ కోసం కొన్ని రోజుల క్రితమే మినీ వేలం జరిగిన విషయం తెలిసిందే. అబుదాబీ వేదికగా ఈ వేలం జరిగింది. ఈ వేలం పాటలో ఓ ఫ్రాంచైజీ చాలా తెలివిగా వ్యవహరించిందని టీం ఇండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కితాబిచ్చాడు. ఆ ఫ్రాంచైజీనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. అండర్-19 ఆసియాకప్‌లో ఆడుతున్న కౌశిక్ చౌహాన్, విహాన్ మల్హోత్రాలను కనీస ధర రూ.30 లక్షలకే ఆర్‌బిసి సొంతం చేసుకుంది. అలాగే వెంకటేశ్ అయ్యర్‌ను రూ.7 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
‘‘రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విహాన్ మల్హోత్రా, కౌశిక్ చౌహాన్‌లను రూ.30 లక్షలకే సొంతం చేసుకుంది. ఈ విషయంలో నేను ఆర్‌సిబిని అభినందిస్తున్నా. ఇది ప్రత్యేకమైన ప్రణాళిక. దీనిలో పెద్దగా పోటీ ఉండదు. కౌశిక్ చౌహాన్ అద్భుతాలు చయనున్నాడు. వేలంలో ఆర్‌సిబికి అంత అదృష్టం ఎలా వచ్చింది? గతంలో వెంకటేశ్ అయ్యర్ కోసం వారు పూర్తిగా ప్రయత్నించారు. అప్పుడు కెకెఆర్ వైదొలగి ఉంటే.. ఆర్‌సిబి వేలం అక్కడే ముగిసి ఉండేది. కానీ ఈసారి కెకెఆర్ పర్స్‌లో డబ్బు ఉన్నా.. ఆర్‌సిబి అతడిని రూ.7 కోట్లకు దక్కించుకోగలిగింది. ఆర్‌సిబి మరోసారి అద్భుతమైన వేలం నిర్వహించింది’’ అని అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్‌లో అన్నాడు.