‘వందేమాతరం’ గేయానికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా డిసెంబర్ 8న మన పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో జరిగిన సుదీర్ఘ చర్చ రాజకీయ రగడగా మారిన సంగతి అందరికీ తెలిసిందే. బెంగాల్ చరిత్ర, సాంస్కృతిక మూలాలలో ‘వందేమాతరం’ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుందనేది జగమెరిగిన సత్యం. 1875లో ప్రముఖ బెంగాలీకవి బంకించంద్ర ఛటర్జీ కలం నుండి ఊపిరిపోసుకున్నఈ గేయానికి సంగీతకారుడు జోదునాథ్ భట్టాచార్య బాణీ కట్టారు. 1896లో కలకత్తా కాంగ్రెస్ సమావేశంలో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గళం నుండి ఈ గేయం గీతమై జాలువారింది. ఆ తరువాత, స్వాతంత్య్రోద్యమంలో అత్యంత ప్రజాదరణ పొందిన నిరసన గీతాలలో ఒకటిగా నిలిచింది. 1937లో మన జాతీయ గేయంగా ఎన్నికైంది. ఇందుకు 1950లో రాజ్యాంగ సభ ఆమోదం కూడా పొందింది. అయితే, ముహమ్మద్ అలీ జిన్నా ఒత్తిడికి తలొగ్గి, నెహ్రూ ‘వందేమాతరం’ని రెండు చరణాలకే కుదించారని, తద్వారా దేశ ప్రజలను విడగొట్టారని పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. ఈ చర్చ రానున్న పశ్చిమ బెంగాల్ ఎన్నికలే లక్ష్యంగా, ‘జాతీయవాదం’ ముసుగులో అక్కడి ప్రజల్లో మతవిద్వేషాలు రేకెత్తించడానికి ఎన్డీయే ప్రభుత్వం వేసిన ఎత్తుగడ అని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ప్రస్తుతం దేశాన్ని పట్టిపీడిస్తున్న సంక్షోభాలనుండి ప్రజల దృష్టిని మళ్ళించే చర్యగా దీనిని అభివర్ణించాయి.
దిల్లీ వాయు కాలుష్యం మొదలుకొని, ఇండిగో సంక్షోభం, రూపాయి పతనం, అధిక ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, రైతులకు మద్దతు ధర లేకపోవడం, మైనారిటీలపై దాడులు, అలాగే లింగ ఆధారిత వివక్ష/ హింస వరకు.. ఇలా దేశంలో ఉన్న ఎన్నో ప్రధాన సమస్యలపై చర్చించకపోవడం ప్రజలపట్ల కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ప్రతిబింబిస్తోందన్న ప్రతిపక్షాల అభిప్రాయంతో మన నవతరం కూడా ఏకీభవిస్తోంది.
ప్రతీకవాదం వేరు, వాస్తవాలు వేరు
ఎన్జీఓ రంగంలో విద్యావేత్తగా పనిచేస్తున్న 27 ఏళ్ళ నిఖితా రీనా, ‘వందేమాతరం’ చర్చని పశ్చిమ బెంగాల్ ఎన్నికల నుండి వేరు చేసి చూడలేమన్నారు. ఎందుకంటే, ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా చేసిన ప్రసంగాలు ఆ గేయంలోని సాంస్కృతిక విలువల గురించి తక్కువ, ఒక నిర్దిష్ట నియోజక వర్గానికి జాతీయవాదాన్ని ఆపాదించే దిశలో ఎక్కువగా దృష్టి పెట్టాయన్నారు. జాతీయ ప్రాధాన్యతలను గుర్తించడం, భవిష్యత్తును చర్చించడం, ప్రగతిశీల, ఇన్‌క్లూజివ్, పౌరులకు సహాయపడే చట్టాలను ఆమోదించడం పార్లమెంటు ప్రాథమిక లక్ష్యాలు. ఒకపక్క, మన దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలుపడింది. నిరుద్యోగం ప్రబలంగా ఉంది. జీవన వ్యయం పెరిగింది. ఇంకోపక్క, ప్రజారోగ్యం, పర్యావరణం, సామాజిక భద్రతా వ్యవస్థలు తీవ్రమైన సవాళ్ళను ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి సమయంలో, చారిత్రక ప్రాముఖ్యం ఉందన్న కారణంతో, ఒక గేయం కోసం పది గంటల సమయాన్ని కేటాయించడం ఓటు రాజకీయం కాక ఇంకేంటి?
ఎన్జీఓ రంగంలో నిఖితా రీనా అనుభవాలు, పరిశీలనలు ఆమె అభిప్రాయాన్ని మరింత బలపరుస్తున్నాయి. స్థానభ్రంశం, కాలుష్యం, పోషకాహార లోపం, అస్థిర జీవనోపాధిని ఎదుర్కొంటున్న సముదాయాలకు ప్రభుత్వ విధానాలు, చొరవలు, జవాబుదారీతనం, సకాలంలో జోక్యం చేసుకోవడం, ఇంకా అధికారుల ప్రతిస్పందన ముఖ్యమని వివరించారు.
దేశీ మార్కెట్
ఆహార భద్రత, మైనారిటీలకు సమాన అవకాశాలు, మధ్యతరగతి గృహనిర్మాణం, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, పేదరిక నిర్మూలన, విద్యాహక్కు, బేటీ బచావో -బేటీ పడావో, మహిళలు -గ్రామీణ ఆరోగ్య సంరక్షణ, విద్య-పరిశోధన నాణ్యత పెంచడం, నైపుణ్యాల గుర్తింపు, ఉపాధి, ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునీకరించడం, బ్యాంకింగ్ సంస్కరణలు- ఇలా రాజకీయ పార్టీలు తమ ఎలక్షన్ మేనిఫెస్టోలలో ప్రకటించింది ఒకటైతే, వాస్తవాలు మాత్రం విరుద్ధంగా ఉన్నాయి. పెరుగుతున్న లేఆఫ్‌లు, కార్పొరేట్ విధానాలు, టాక్సిక్ వర్క్ కల్చర్, అధిక పని వేళలు, జెండర్ గ్యాప్ లాంటి అంశాలలో సంస్థాగత చర్యలు లేకపోవడం చాలా నిరాశాజనకంగా ఉంది. దాంతో, మా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడడంతోపాటు, వర్క్-లైఫ్ బ్యాలెన్స్ కూడా దెబ్బతింటోంది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని, ఎన్‌సీపీ ఎంపీ సుప్రియా సూలే ‘రైట్ టు డిస్కనెక్ట్ బిల్’ ప్రవేశపెట్టడం నిజంగా హర్షణీయం. కానీ ఇవేవీ పట్టనట్టు, ఎప్పుడో రాసిన వందేమాతరం గురించి చర్చించి, కేంద్ర ప్రభుత్వం ఏం నిరూపించింది? ఐటీ రంగంలో అవకాశాలు లేకపోవడంతో, గత 8-9 నెలలుగా ఫ్రీలాన్స్ వర్క్‌కే పరిమితమైన శ్రీలత గండికోట ప్రశ్నించారు.
మహిళా సాధికారత, రక్షణ ఒక మిథ్య
మహిళలకు ఇంట్లో, బయటా స్వేచ్ఛ, గౌరవం కరువైన ఈ సమాజంలో, సాధికారత/ సమాన అవకాశాలు కేవలం ఒక అపోహ. ఎందుకంటే, ఆర్థిక మాంద్యం రాగానే, మొదట ఉద్యోగాలు కోల్పోతోంది మహిళలే. ఇది చాలదన్నట్లు, ఈ ఏడాది జూన్‌లో, తమ దేశ మహిళలు భారతదేశంలో ఒంటరిగా ప్రయాణించ వద్దని అమెరికా విదేశాంగ శాఖ సిఫార్సు చేసింది. ‘భారతదేశంలో విపరీతంగా పెరుగుతున్న నేరాలలో అత్యాచారం ఒకటి,’ అని లెవెల్-2 హెచ్చరికను కూడా జారీ చేసింది. ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్ళలో మౌలిక సదుపాయాలు, అమ్మాయిలకు భద్రత, బడ్జెట్ కేటాయింపులు లేవు. పోక్సో కేసులు నమోదు చేసే యంత్రాంగం లేదు అంటూ తెలుగు రాష్ట్రాల్లో పని చేస్తున్న ఒక హక్కుల ఆధారిత సంస్థలోని యువ వాలంటీర్ వాపోయారు.
విదేశీ అవకాశాలు
అక్టోబర్ 2022 నుండి సెప్టెంబర్ 2023 మధ్య, అమెరికా జారీ చేసిన హెచ్1బీ వీసాల లబ్ధిదారులలో 72.3 శాతం భారతీయ పౌరులే. దీని బట్టి, మనవాళ్ళు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి ఎంత ప్రాధాన్యతనిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఎంఎస్‌సీ ఎనలిటికల్ కెమిస్ట్రీ తరువాత, హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ ఫార్మా కంపెనీలో సైంటిస్ట్‌గా పనిచేస్తున్న 26 ఏళ్ళ నాగార్జున్, అమెరికాలో పీహెచ్డీ అవకాశాల కోసం గత కొన్ని నెలలుగా ప్రయత్నిస్తున్నారు. కానీ, హెచ్1బీ అప్లికేషన్‌ల ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో, అతని ఆశ అడియాస అయ్యింది. ఇప్పటికే ఆర్థికంగా సతమవుతున్న మధ్యతరగతికి ఇక అమెరికా అందని ద్రాక్షే! సోషల్ మీడియా వెట్టింగ్ లాంటి కొత్త నియమాల వల్ల వీసా రావడం కష్టమవుతుంది. అందుకే, నేను యూరప్‌కి వెళ్దామనుకుంటున్నాను. ఇక్కడేమో కానీ, ఇమిగ్రంట్స్‌కి అక్కడ మంచి డిమాండ్ ఉంది. ఒక్క 2024లోనే, 2.06 లక్షల మంది భారతీయులు ఇక్కడి పౌరసత్వం వదులుకొని, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ దేశాల పౌరసత్వం పొందారు. అంటే, ‘పర్మనెంట్ సెటిల్‌మెంట్’ కి మన యువత ఎంత ప్రాధాన్యతనిస్తోందో అర్థమవుతోంది.
మన దేశంలో ఇంకా ఏం మిగిలుంది? ఉద్యోగాలు లేవు. భూమీ, నీళ్ళూ, గాలీ కలుషితమయ్యాయి. పేరుకే మనది ప్రజాస్వామ్యం. కానీ, ఓట్లు కూడా చోరీ అవుతున్నాయి. జనం ఎప్పుడో కులం, మతం, జాతి, అంతస్తు పేరుతో చీలిపోయారు. ప్రభుత్వ రంగ సంస్థలే కాకుండా, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, స్కూల్స్ సైతం ప్రైవేటైజ్ అవుతున్నాయి. ఈ లెక్కన, త్వరలో రిజర్వేషన్ వ్యవస్థకు మనం స్వస్తి చెప్పొచ్చు. అయినా, ఎన్నికలొచ్చినప్పుడు, బిజెపి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ఎత్తుగడ వేస్తూ వస్తోంది. బెంగాల్ ఎన్నికల దృష్ట్యా ఇప్పుడు ఇది, అంటూ, యూకే వీసా కోసం ఎదురుచూస్తున్న రుక్షియా బేగం నిట్టూర్చారు.
ఇదేనా ‘వందేమాతరం’ స్ఫూర్తి?
మన యువతలో ఆత్మహత్యల రేటు ఆందోళనకరమైన స్థాయిలో ఉంది. ఎన్‌సిఆర్‌బి 2022 నివేదిక ప్రకారం, భారతదేశంలో, ప్రతి సంవత్సరం సుమారు 13,000 మంది యువతీ యువకులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ప్రేమ వ్యవహారాలు, పెళ్ళి, కుటుంబ అంచనాలు, డ్రగ్స్, ఒత్తిడి, నిరుద్యోగం, వేధింపులు ఇవన్నీ ఈ బలవన్మరణాలకు ప్రధాన కారణాలు. ఇదొక జాతీయ విపత్తు. కానీ, దీనిపై పార్లమెంటులో చర్చ జరగదు. ‘వందేమాతరం’ స్ఫూర్తిని మన పార్లమెంటు గౌరవిస్తోందన్నది నిజమే అయితే, ఆ గేయం కాంక్షించిన సమాజాన్ని సృష్టించడానికి, మన రాజకీయ నాయకులు పారదర్శకత, జవాబుదారీతనంపై ఎందుకు దృష్టి పెట్టరు? తెలుగు రాష్ట్రాలలో గే హక్కుల కోసం పోరాడుతున్న సామాజిక కార్యకర్త విష్ణు తేజ ప్రశ్నించారు. ఏదేమైనా, ‘వందేమాతరం’ చర్చ సాంస్కృతిక, సైద్ధాంతిక ప్రతీక వాదంగా మారింది. మొదటి నుండీ, బెంగాల్ రాజకీయాలు సంస్కృతి, చారిత్రాత్మక, మేధోపరమైన చర్చ, ప్రాంతీయ ఆత్మగౌరవానికే పెద్ద పీట వేస్తూ వచ్చాయి. ఇప్పుడు, కేంద్ర ప్రభుత్వం వేసిన ఈ ఎత్తుగడ అక్కడి ఓటర్ల విశ్వాసాన్ని గెలుస్తుందా లేదా అన్నది సమయమే నిర్ధారిస్తుంది.
వై. కృష్ణజ్యోతి
(ఫ్రీలాన్స్ జర్నలిస్ట్)