మన తెలంగాణ/నాంపల్లి: నేషనల్ హెరాల్డ్ కేసు ల్లో కాంగ్రెస్ దిగ్గజ నాయకులు సోనియాగాంధీ, రా హుల్ గాంధీలపై తప్పుడు కేసులు పెడుతూ వేధిస్తున్నారంటూ కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర స్థాయిలో ఆగ్ర హం, ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. రాజకీయ కక్షపూరితంగా వారిపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ మండిపడ్డారు. గురువారం గాంధీభవన్‌కు పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ సా రధ్యంలో పార్టీ శ్రేణులు, నాయకులు చేరుకున్నారు. పక్కనే రాష్ట్ర బీజేపీ ఆఫీస్‌ను ముట్టడించేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, నాయకుల మద్య వాగ్వావాదాలు, నినాదాల హోరుతో పరిస్థితి ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ రాజకీయ దురుద్దేశాలతో పస లేని కేసులు పెట్టారంటూ బీజేపీ ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడి,
అమిత్ షా డౌన్ డౌన్, రాజ్యాంగం జిందాబాద్, జై కాంగ్రెస్, రాహుల్ గాంధీ నాయకత్వం జిందాబాద్ అంటూ అప్పటికే పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పలు అంచుల భద్రత చర్యలను కట్టుదిట్టం చేశారు. బీజేపీ ఆఫీస్‌ను ముట్టడించేందుకు వెళ్లకుండా పోలీసులు గాంధీభవన్ ప్రవేశ గేట్‌ను మూసేసి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. చుట్టూ బారీకేడ్లు, తాళ్లతో కట్టేశారు. దీంతో బీజేపీ ఆఫీస్‌కు వెళ్లకుండా వారిని నియంత్రించారు. కొందరు బయటికి వచ్చేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. రానీయకండా భారీ భద్రత బలగాలను మోహరించారు. దీంతో ఆందోళనకారులు లోపలనే ఉన్నారు. గంటల తరబడి గాంధీభవన్‌లోపలే ఉన్న నేతలు బయటికి వచ్చేందుకు యత్నించగా పోలీసులు నిలువరించారు. దీంతో వారు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈక్రమంలో పలువురు యువకులు గేట్‌పై ఎక్కి కిందికి దూకేందుకు యత్నించగా భద్రత బలగాలు అడ్డుకున్నారు. దీంతో మెడికి వ్యతిరేకంగా నినాదాలతో ఈ ప్రాంతం హోరెత్తాయి.
కక్ష సాధింపు చర్యల్లో భాగంగా సోనియా, రాహుల్ గాంధీపై తప్పుడు కేసులు : మహేశ్‌కుమార్ గౌడ్
కేవలం గాంధీ కుటుంబాన్ని మచ్చ, అప్రతిష్ఠ పాల్జేసే కుట్రలో భాగంగా నేషనల్ హెరాల్డ్ కేసులో ఇద్దరిపై తప్పుడు కేసులు పెట్టి రాజకీయంగా వేధిస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సోనియా, రాహుల్‌నే లక్షంగా చేసుకుని కేంద్రం పస లేని కేసుల్లో రాజకీయ దురుద్దేశంతో వేధిస్తోందన్నారు. శాంతియుత నిరసన తెలిపేందుకే తాము బీజేపీ ఆఫీస్‌ను ముట్టడికి పిలుపునిచ్చామని, అక్కడికి వెళ్లి విధ్వంసం చేసేందుకు కాదన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహరాల ఇన్‌ఛార్జీ మినాక్షి నటరాజన్, తెలంగాణ మత్సకారుల సహకార సంఘాల సమాఖ్య ఛైర్మన్ మెట్టు సాయికుమార్, కార్పొరేటర్ విజయారెడ్డి, నాయకులు మోతే రోహిత్ ముదిరాజ్, పీసీసీ కార్యదర్శి నిర్మల్‌కుమార్ యాదవ్ పలువురుతోపాటు భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు నిరసనలో పాల్గొన్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు లోపల ఉన్న కాంగ్రెస్ నేతలు వారి ఇళ్లకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది.
బీజేపీ ఆఫీస్ ముట్టడికి యత్నించిన కాంగ్రెస్ నేతలు
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర బీజేపీ ఆఫీస్‌ను ముట్టడించేందుకు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సారధ్యంలో పలువురు కార్యకర్తలు ప్రైవేట్ వాహనాల్లో వచ్చారు. తొలుత వారిని పోలీసులు అడ్డగించారు. దీంతో వారి మద్య వాగ్వావాదాలతో పరిస్థితి వేడేక్కింది. ఈ క్రమంలో పలువురు లోపలికి చొరబడేందుకు యత్నించగా భద్రత బలగాలు నిలువరించారు. ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌ను సముదాయించి ఆయనను సొంత కారుల్లో ఇంటికి పంపించారు. ముందస్తుగా ఎలాంటి ఆవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత బలగాలు బీజేపీ ఆఫ్‌స్ వద్ద మూడంచెల భద్రతను కట్టుదిట్టం చేశారు. అన్ని దారులు మూసివేశారు. సాయంత్రం వరకు మొహరించారు. పరిస్థితిని ఎప్పటిపుడు సమీక్షించారు.