న్యూఢిల్లీ: ప్రతిపక్ష సభ్యుల తీవ్ర నిరసనల మధ్య గురువారం లోక్ సభ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ గార్ , అజీవిక మిషన్ (గ్రామీణ్) విబి -జి ఆర్ జి బిల్లు 2025 ను ఆమోదించింది. ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం నిబంధనలను నీరు గార్చిందని, మహాత్మా గాంధీ పేరును పథకం నుంచి తొలగించడం ద్వారా జాతిపితను అవమానించిందని ప్రతిపక్షపార్టీలు ఆరోపించాయి. ప్రతి ఇంటికీ 125 రోజుల గ్రామీణ ఉపాధిని హామీ ఇచ్చే జి రామ్ జి బిల్లును కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సమర్థించారు. మొదట్లో గ్రామీణ ఉపాధి పథకానికి మహాత్ముడి పేరు పెట్టే ఆలోచన లేదని, కేవలం 2009 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎంఎన్‌ఆర్ ఇజిఏ పథకానికి
అప్పటి ప్రభుత్వం మహాత్మాగాంధీ పెట్టిందని ఆయన ఆరోపించారు. నిజానికి 2014 లో మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఆ గ్రామీణ ఉపాధి గ్యారంటీ పథకం సక్రమంగా అమలు అయిందని మంత్రి స్పష్టం చేశారు. లోక్ సభలో జి రామ్ జి బిల్లుపై ఎనిమిది గంటలపాటు జరిగిన చర్చకు మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సమాధానమచ్చారు. నరేంద్రమోదీ ప్రభుత్వం వివిధ కార్యక్రమాల ద్వారా మహాత్మా గాంధీ ఆదర్శాలను నిలబెట్టేందుకు కృషి చేసిందన్నారు. కాంగ్రెస్ మహాత్మాగాంధీని ఆయన ఆదర్శాలకు ఎప్పుడో నీళ్లు వదిలిందని ఆయన ఆరోపించారు. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన, ఉజ్వల యోజన, స్వచ్ఛ్ భారత్ మిషన్, ఆయుష్మాన్ భారత్ కింద పక్కా ఇళ్ల నిర్మాణం వంటి పథకాలు అమలు ద్వారా గాంధీ కలలను ఎన్డీఏ సర్కార్ నిజం చేసిందని చౌహాన్ గొప్పగా చెప్పారు.జవహర్ లాల్ నెహ్రూ, మహాత్మాగాంధీ పేర్లతో ఉన్న అనేక సంక్షేమ పథకాల జాబితాను ఏకరువు పెడుతూ, మోదీ సర్కార్ ఇష్టారాజ్యంగా పథకాల పేర్లను మారుస్తున్నదన్న ప్రియాంక గాంధీ విమర్శలను మంత్రి తిప్పికొట్టారు.గ్రామీణ ఉపాధి పథకం నుంచి మహాత్మాగాంధీ పేరు తొలగించడాన్ని నిరసిస్తూ, ప్రతిపక్షసభ్యులు నినాదాలు చేశారు. ఒక దశలో సభ మధ్యలోకి దూసుకువెళ్లి బిల్లు ప్రతులను చింపి, స్పీకర్ కుర్చీ వైపు విసిరివేశారు. దీంతో సభలో కొంతసేపు గందరగోళం నెలకొంది. బిల్లు సభ ఆమోదం పొందగానే సభను స్పీకర్ ఓం బిర్లా వాయిదా వేశారు.
పార్లమెంటు ప్రాంగణంలో నిరసన ప్రదర్శన
అంతకుముందు బిల్లును ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంటు ప్రాంగణంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ చట్టం ద్వారా గాంధీజీని అవమానించడమే కాక, గ్రామీణ భారతంలో సామాజిక, ఆర్థిక మార్పులకు దారి తీస్తున్న పని హక్కును దెబ్బ తీశారని విమర్శించారు. మకర్ ద్వార్ వద్ద జరిగిన ప్రదర్శనలో కాంగ్రెస్ సీనియర్ నేత సోనియాగాంధీ ఎంపీలతో కలిసి పాల్గొన్నారు.
కొత్త పథకంపై ఉద్యమం.. సిడబ్లూసిలో వ్యూహం
కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నిర్ణయాత్మక విభాగం అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఈనెల 27న జరగనుంది. కేంద్ర ప్రభుత్వం “ఎంజీఎన్‌రేగా” పథకాన్ని రద్దు చేసి కొత్త చట్టాన్ని తీసుకురావడంపై , అలాగే దేశం లోని ప్రస్తుత రాజకీయ రాజకీయ పరిస్థితులపై విస్తృతంగా చర్చించనున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తరువాత జరుగుతున్న మొదటి సిడబ్లుసి సమావేశం ఇదే కావడం విశేషం. అంతేకాదు 2026 తొలి అర్థభాగంలో జరగనున్న అసోం, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, బెంగాల్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ వ్యూహాన్ని ఈ సమావేశంలో ఖరారు చేసే అవకాశం ఉంది. యుపిఎ ప్రభుత్వ హయాంలో అమల్లోకి వచ్చిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి దాని స్థానంలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ ( గ్రామీణ్ ( విబి..జి రామ్ జి బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. దీని గురించి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే మాట్లాడుతూ ఇది కేవలం పేరు మార్చడమే కాదని, ప్రపంచం లోనే అతిపెద్ద ఉపాధి హామీ పథకాన్ని వ్యవస్థాపితంగా అంతమొందించడమేనని వ్యాఖ్యానించారు. కొత్త చట్టం ద్వారా ప్రభుత్వం పేదల నుంచి పనిచేసే హక్కును లాక్కుంటోందని ఆరోపించారు. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని తెలిపారు. మహాత్మాగాంధీ పేరుతో ఉన్న ఎంజీఎన్‌రే పథకాన్ని తొలగించడం ద్వారా గాంధీజీ ఆలోచనలను అవమానించడమేనని ధ్వజమెత్తారు. కొత్త బిల్లు ప్రకారం ప్రతి గ్రామీణ కుటుంబానికి ఒక ఆర్థిక సంవత్సరంలో 125 రోజుల వేతన ఉపాధి హామీ కల్పిస్తామని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఈ ఉపాధి అమలు విధానం, నిధుల కేటాయింపు , పని లభ్యత వంటి అంశాల్లో స్పష్టత లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. చట్టం అమలు లోకి వచ్చిన ఆరు నెలల్లోగా రాష్ట్రాలు కొత్త చట్టానికి అనుగుణంగా తమ పథకాలను రూపొందించాల్సి ఉంటుంది. అయితే దీనివల్ల కేంద్రం బాధ్యత తగ్గిపోయి, రాష్ట్రాలపై భారం పడుతుందని కాంగ్రెస్ వాదిస్తోంది.